- మరో రెండ్రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు
- సొంత ఊర్లకు పయనమైన వలసజీవులు
- హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న బస్సులు, రైళ్లు కిటకిట
- గత వారం రోజులుగా రిజర్వేషన్లు ఫుల్
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి వలస జీవులు భారీ ఎత్తున సొంత రాష్ట్రం ఏపీకి తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు, సొంత పట్టణాలకు తరలివస్తున్న వారితో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి.
హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో ఏపీ ప్రజలు ఉన్నారు. వారందరూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండడంతో సొంత ఊరి బాటపడుతున్నారు. ఎన్నికలకు మరో రెండ్రోజుల సమయమే ఉండడంతో బస్సులు, రైళ్లలో, సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి పయనమవుతున్నారు.
గత వారం రోజుల నుంచే బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ఇదే అదనుగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 2 వేల స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. వీటిని ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్, ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి నడుపుతున్నారు.