- పాలస్తీనాకు యూఎన్ సభ్యత్వం ఇవ్వాలంటూ తీర్మానం
- తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన భారత్
- పాలస్తీనాకు మద్దతు పలుకుతూ 143 సభ్యదేశాల ఓటు
- భద్రతామండలి పాలస్తీనా సభ్యత్వంపై సానుకూలంగా స్పందించాలని భారత్ అభ్యర్థన
పాలస్తీనాకు భారత్ మరోసారి అండగా నిలిచింది. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కోరుతూ శుక్రవారం ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనా సభ్యత్వంపై భద్రతామండలి సానుకూలంగా వ్యవహరించాలని కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు. భద్రతామండలి అభ్యంతరాల కారణంగా పాలస్తీనాకు యూఎన్ సభ్యత్వం దక్కడంలో ఆటంకాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.
శుక్రవారం ఉదయం ముసాయిదా తీర్మానం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ముందుకొచ్చింది. అరబ్ గ్రూప్ తరపున యూఏఈ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి భారత్ సహా 143 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. తొమ్మిది దేశాలు వ్యతిరేకించగా మరో 25 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు లభించడంతో అసెంబ్లీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వానికి పాలస్తీనాకు అన్ని అర్హతలు ఉన్నట్టు ఈ తీర్మానం తేల్చింది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని ఆర్టికల్ 4 ప్రకారం, పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకోవాలని తీర్మానంలో ప్రతిపాదించారు. ఈ తీర్మానికి అనుబంధంగా మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. దీని ప్రకారం, ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనా పాల్గొనవచ్చు. ఆంగ్ల అక్షర క్రమంలో సభ్యదేశాల మధ్య పాలస్తీనాకు సీటు కేటాయిస్తారు.
కాగా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను అక్కడి ప్రజల ప్రతినిధిగా గుర్తించి తొలి అరబ్-యేతర దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత 1988లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించింది. 1996లో కేంద్ర ప్రభుత్వం గాజాలో భారత ప్రతినిధి కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. 2003లో ఈ కార్యాలయాన్ని రమల్లాకు తరలించారు.