ఢిల్లీ, మహారాష్ట్రలో సడలింపులు .. భారీగా రోడ్లపైకి వచ్చిన జనాలు..
-ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్
-నిబందనలు పాటించకపోతే మళ్ళీ కఠిన చర్యలు ఉంటాయన్న ఉద్దవ్
రద్దీగా కనపడుతోన్న బస్టాండ్లు
పలు చోట్ల భౌతిక దూరం పాటించని ప్రజలు
తిరిగి ముంబై, ఢిల్లీ చేరుకుంటోన్న వలస కార్మికులు
ఢిల్లీ ,మహారాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సెకండ్ వేవ్ కట్టడికోసం విధించిన లాక్ డౌన్ కు ఆయా రాష్ట్రాలు సడలింపులు ప్రకటించడంతో ప్రజలు ఒక్కసారిగా విధుల్లోకి వస్తున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరుగుతుంది . ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు . ఫలితంగా మరోసారి కరోనా విజృభించే అవకాశం ఉందని నిబంధనలు పాటించి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రజలకు విజ్నప్తి చేశారు. అయినప్పటికీ ప్రజలు భేఖాతర్ అంటున్నారు. ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మరికొన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ సడలించాలని అనుకుంటున్నా ఢిల్లీ , మహారాష్ట్ర లలో అమలు జరుగుతున్నా లాక్ డౌన్ సడలింపులు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
మహారాష్ట్రలో దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు దశల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. సడలింపులు ఇచ్చిన నగరాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనాలు రోడ్లపైకి వచ్చేశారు. దీంతో పలు ప్రాంతాలు రద్దీగా కనపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు తెరుచుకోవడంతో జనాలు అక్కడ కూడా భారీగా కనపడుతున్నారు. అసలే దేశంలోనే జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ఉన్న ముంబై , ఢిల్లీలలో రద్దీ సాధారణంగానే అధికంగా ఉంటుంది. దీనికి తోడు చాలారోజుల తరువాత ప్రజలు రోడ్లపైకి రావడంతో రద్దీ అధికంగా ఉంది .
బస్టాండ్లలో కరోనా నిబంధనలు పాటించాలని సూచనలు చేయడంతో లైన్‌లో నిలబడి బస్సులు ఎక్కుతున్నారు. ఢిల్లీలోనూ నేటి నుంచి వ్యాపార, వాణిజ్య, రవాణా కార్యకలాపాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై కనపడుతున్నారు.
పలు ప్రాంతాల్లో కరోనా నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ప్రయాణికులు పెద్ద ఎత్తున మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ముంబై, ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులు మళ్లీ ఆయా నగరాలకు తిరిగి వస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిలు ఈమేరకు ఫలితాలనిస్తున్నాయనే విషయాలను మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి.