Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

వచ్చేది ‘ఇండియా’ ప్రభుత్వమే.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన మమత

  • బీజేపీకి 200 సీట్లు కూడా దాటవన్న మమత
  • పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు బీజేపీతో కాంగ్రెస్, సీపీఐ చేతులు కలిపాయని ఆరోపణ
  • కొందరు సన్యాసులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు

ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడేది ‘ఇండియా’ కూటమి ప్రభుత్వమేనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు బీజేపీతో కాంగ్రెస్, సీపీఐ చేతులు కలిపాయని ఆరోపించారు. కాషాయ శిబిరానికి ప్రయోజనం చేకూర్చే టీఎంసీ యేతర పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. అరాంబాగ్ లోక్‌సభ నియోజకవర్గంలోని గోఘట్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు సన్యాసులు కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆలయ పర్యవేక్షణ చేసే సాధుసంతులను తాము గౌరవిస్తామని, కానీ వారందరూ అదే పనిచేయడం లేదని విమర్శించారు. 

రాష్ట్రంలోని ఓ పోలింగ్ బూత్‌లో టీఎంసీ ఏజెంట్ కూర్చోకుండా ఓ నిర్దిష్ట సన్యాసి వర్గానికి చెందిన సాధువు అడ్డుకున్నారని మమత ఆరోపించారు. గతంలో తాను ఎంతో గౌరవంగా భావించే అలాంటి సన్యాసి ఒకరు బహరంపూర్‌లో టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గౌరవం కోల్పోయారని తెలిపారు. అసన్‌సోల్‌లో కొందరు సాధవులు ప్రత్యేకంగా ఓ పార్టీకి ఓటు వేయాలని భక్తులను కోరారని పేర్కొన్నారు. మోదీని ‘ఝూటా ప్రధాని’గా అభివర్ణించిన మమత  తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, అబద్ధపు హామీలతో ప్రజలను మోసపుచ్చుతున్నాని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అదేమైందని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఇప్పటికి 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందని గుర్తుచేశారు. ఈసారి ఎందుకు అదే హామీ ఇవ్వడం లేదని నిలదీశారు.

Related posts

యూపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ

Ram Narayana

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా

Ram Narayana

వారసుడు అంశంపై మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

Leave a Comment