- అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని వెల్లడి
- రెండు పార్టీల మధ్య బలమైన మైత్రికి సూచనగా నిర్ణయం
- ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలను కూటమి గెల్చుకోవాలని ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలకు సూచన
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో జరగనున్న పోలింగ్ లో తన ఓటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థికే వేస్తానంటూ వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా, ఆప్ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారని చెప్పుకొచ్చారు. ఈమేరకు ఢిల్లీలో శనివారం జరిగిన కూటమి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య బలమైన మైత్రీ బంధానికి సూచనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పనిచేయాలని, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులే గెలిచేలా కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.
ఇదే వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ మరోసారి సవాల్ విసిరారు. పదేళ్ల ఎన్డీఏ కూటమి పాలనపై, మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు. మోదీ చర్చకు అంగీకరిస్తే ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే తాను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. ప్రధాని మోదీ కనుక చర్చకు వస్తే తాను క్రోనీ క్యాపిటలిజంపైన, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన, ద్రవ్యోల్బణం, నిరుద్యోగితపైన ప్రశ్నలు అడుగుతానని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా చాందినీ చౌక్ లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. మోదీ సర్కారు మీకు చేసిందేంటని నిలదీశారు. జీఎస్టీ, నోట్ల రద్దు, ఇతరత్రా పన్నుల భారం మోపడం తప్ప మోదీ మీకోసం చేసిందేమీ లేదని వివరించారు. పదేళ్ల పాలనలో ఆయన కేవలం 22- 25 మంది బడా వ్యాపారవేత్తల కోసమే పనిచేశారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.