Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రేవ్ పార్టీ కీలక సూత్రధారి లంకపల్లి వాసు …

బెంగళూరు రేవ్ పార్టీ… డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు…

  • నోటీసులు పంపించిన సీసీబీ
  • రేవ్ పార్టీ కేసులో ఏ1గా వాసు పేరు
  • సన్ సెట్ టు సన్ రైజ్ పేరుతో బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు
  • రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు

లంకపల్లి వాసు.. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. క్రికెట్‌ బెట్టింగ్‌ మొదలుకుని రాజకీయ బెట్టింగ్‌ల వరకు అన్నీ కలిసొచ్చి రూ.కోట్లకు అధిపతి అయ్యాడు. క్రికెట్‌ సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్‌లు నిర్వహించేవాడు. దీనిద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. ఈ బెట్టింగ్‌లపై వాసు రూ.200 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది.

పూరింటితో మొదలై..
కొత్తపేటలోని ఆంజనేయ వాగు కొండపై గతంలో ఒక పూరింట్లో నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు తొలుత కూలీ పనులు చేసుకుని జీవించేవారు. తండ్రి చనిపోవడంతో తల్లి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. కేదారేశ్వరపేటలో లోటస్‌కు చెందిన ఒక బుకీని పరిచయం చేసుకుని, అతని వద్ద చేరి, బెట్టింగ్‌లపై పూర్తి పట్టు సాధించాడు. అనతికాలంలోనే రూ.200కోట్లకు పైగా కూడగట్టాడు. ఎన్నో ఇళ్లు, విల్లాలు కట్టాడు. వాటన్నింటికీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆంజనేయ వాగు కొండ ప్రాంతంలో పైభాగాన ఒక రేకుల షెడ్‌ను అత్యాధునికంగా నిర్మించి, సీసీ కెమెరాలు అమర్చాడు. స్థానికంగా ఉండే బుకీలు ఈ షెడ్‌లో బెట్టింగ్‌లు నిర్వహించేవాడు.

బెంగళూరు పార్టీ నిర్వహించింది ఇతనే..

బెంగళూరులోని ఫాంహౌస్‌లో సన్‌సెట్‌-సన్‌రైజ్‌ పేరుతో వాసు పార్టీ నిర్వహించాడు. దీనికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశాడు. అందులోనే ఆహ్వానాలు పంపాడు. పుట్టినరోజు పార్టీ కోసమని ఫాంహౌస్‌ను తీసుకున్నాడు. కెంపెగౌడ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును గురువారం బెంగళూరు సీసీబీ (సెంట్రల్‌ క్రైం బ్యూరో)కు బదిలీ చేశారు. బెట్టింగ్‌ల వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చినప్పటికీ డ్రగ్స్‌ వ్యవహారం తేలాల్సి ఉంది. పార్టీలో ముగ్గురు డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తులను అరెస్టు చేశారు. వాసుతో స్నేహం లేకుండా వారు పార్టీలోకి రావడం అసాధ్యమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాసు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. అతడి తల్లి అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది.

పార్టీ కేసులో పలువురి రక్తనమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అందులో తెలుగు నటి కూడా ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు పంపించింది. ఈ కేసులో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్ బాబు, ఏ5గా మహమ్మద్ అబూబాకర్, ఏ6గా గోపాల్ రెడ్డి, ఏ7గా 68 మంది పురుషుల పేర్లు, ఏ8గా 30 మంది యువతుల పేర్లను పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి 14 గ్రాముల ఎండీఎం, 5 గ్రాముల కొకైన్, భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోటిన్నర రూపాయల విలువ చేసే డీజే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏ1 నిందితుడు వాసు సన్ సెట్ టు సన్ రైజ్ పేరుతో బర్త్ డే వేడుకలను నిర్వహించినట్లు చెప్పారు. ఈ రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొన్నారని… ఇందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. 

మరోవైపు, రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు పంపించింది. ఇప్పటికే పలువురిని విచారిస్తున్నారు. నటి హేమతో పాటు ఆషిరాయ్‌కి కూడా పాజిటివ్ వచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. హేమ కృష్ణవేణి పేరుతో ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీస్ రికార్డుల్లోనూ అదే పేరు ఉందని తెలుస్తోంది.

Related posts

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆసక్తికర పరిణామాలు…

Drukpadam

పదిహేనేళ్ల పాటు అంధురాలిగా నటించిన ఇటలీ మహిళ.. ఎందుకంటే!

Drukpadam

పెళ్లి వేడుకలో విషాదం …బాలుడు అనుమానాస్పద మృతి …!

Ram Narayana

Leave a Comment