గుజరాత్ లోని ఓ గేమింగ్ జోన్ లో ఘోర అగ్నిప్రమాదం… 35 మంది మృతి…
రాజ్ కోట్ లోని టీఆర్పీ గేమింగ్ జోన్ లో మంటలు
మృతుల్లో పలువురు చిన్నారులు
నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమంటున్న పోలీసులు
గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 35 మంది మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. 20 మంది చిన్నారులను అధికారులు కాపాడారు.
ఈ ప్రమాదంపై రాజ్ కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ స్పందించారు. ఇప్పటివరకు ఘటన స్థలం నుంచి 20 మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు. టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించిందని, ప్రస్తుతానికి అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీపీ పేర్కొన్నారు. గేమింగ్ జోన్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజ్ కోట్ లో అగ్నిప్రమాదం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు.
కాగా, ఈ ఘటనలో మృతి చెందిన వారికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్టు గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తామని తెలిపారు.