- నల్లగొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో మృతదేహం లభ్యం
- మృతుడిని ఆవుల వంశీగా గుర్తించిన అధికారులు
- ఇటీవలే నాగార్జునసాగర్‌లో మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం
- ఈ ఉదంతం మరువకముందే ఇప్పుడు మరో ఘటన
ఇటీవలే నాగార్జునసాగర్‌లో ఎండల తాకిడితో దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ మున్సిపాలిటీలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం కనిపించింది. వాటర్ ట్యాంకులో నీళ్లను చెక్ చేయగా అందులో శవం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు.
కాగా, ఆ మృతదేహాన్ని హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు అధికారులు. అతడు పది రోజుల క్రితం అదృశ్యం కావడంతో మిస్సింగ్ కేసు నమోదైయింది. ఈ క్రమంలో తాజాగా వాటర్ ట్యాంకులో అతని శవం దొరికింది. అయితే, అతడు బలవన్మరణానికి పాల్పడ్డడా ? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయం తెలియాల్సి ఉంది.
కాగా, ఇలా మృతదేహం ఉన్న ఇవే నీళ్లను గత పది రోజులుగా మున్సిపాలిటీ జనాలు తాగుతున్నారు. దాంతో శవం ఉన్న నీటిని పది రోజుల నుంచి వాడినట్లు తెలుసుకున్న స్థానికులు తమకు ఏం అవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.