చిరు వ్యాపారులపై కేంద్రం వివక్ష వారికీ అండగా నిలుద్దాం :స్టాలిన్
– 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
-వ్యాక్సినేషన్ విధానంలో మార్పులు చేసిన కేంద్రం
-ప్రజలందరికీ కేంద్రమే ఉచిత టీకా
-రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి వల్లేనన్న స్టాలిన్
-చిరు వ్యాపారుల రుణాలపై మారటోరియం ప్రకటించాలని డిమాండ్
-రూ.5కోట్ల రుణాలపై 6 నెలలు ఉపశమనం కల్పించాలని విన్నపం
-కలిసికట్టుగా పోరాడుదామని ఆయా రాష్ట్రాలకు పిలుపు
రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకే కేంద్రం వ్యాక్సినేషన్‌పై తన వైఖరిని మార్చుకుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అన్నారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించాలని కోరుతూ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు.
ఎంఎస్‌ఎంఈ, చిరు వ్యాపారులపై కేంద్రం వివక్ష చూపుతోందని స్టాలిన్ ఆరోపించారు. కొవిడ్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఈ వర్గాలకు కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదని తెలిపారు. చిరు, మధ్యస్థాయి వ్యాపారులు తీసుకున్న రుణాలపై మారటోరియం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖ రాయాలని బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న 12 రాష్ట్రాల సీఎంలను కోరారు. కనీసం రెండు త్రైమాసికాల వరకు రూ.5 కోట్ల రుణాలపై ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చిరు వ్యాపారులకు ఎలాంటి ఉపశమనం కల్పించని పక్షంలో అనేక వ్యాపారాలు శాశ్వతంగా మూతపడతాయని స్టాలిన్ వాపోయారు.