- కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- బడ్జెట్ లో తెలంగాణ ఊసే లేదన్న బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
- తెలంగాణకు మరోసారి దగా జరిగిందని ఆవేదన
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత బి.వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించలేదని తెలిపారు.
“రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేటాయింపులు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి సంవత్సరం రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి హైదరాబాద్-బెంగళూరు కారిడార్ గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు చూసుకుంటే కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే తెలంగాణలో ఉంటుంది… మిగతాదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో ఉంటుంది. నిజంగా తెలంగాణకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించదలచుకుంటే హైదరాబాద్-నాగపూర్ కారిడార్ ను ప్రకటించాలి. దానివల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించారు. ఇప్పటికే చాలా కేటాయింపులు చేశారు. మరింత సాయం అందిస్తామని కూడా చెబుతున్నారు… మంచిదే. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణలో గోదావరిపై, కృష్ణా నదిపై జాతీయ ప్రాజెక్టుల గురించి చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ నిర్మలా సీతారామన్ గారు ఒక్క ప్రస్తావన కూడా చేయకపోవడం దురదృష్టకరం. ఈ బడ్జెట్ లో చంద్రబాబు, నితీశ్ కుమార్ ల రాష్ట్రాలకే పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
లోక్ సభలో బీజేపీకి 8 మందిని, కాంగ్రెస్ కి 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఈ 16 మంది ఎంపీలు బడ్జెట్ చర్చలో పాల్గొని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, నవోదయ విద్యాలయాలు, జాతీయ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల కోసం పట్టుబట్టాలి. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు వాటన్నింటిని సాధించుకోవాలి” అని స్పష్టం చేశారు.