Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం!

  • కేటీఆర్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్న సీఎం
  • బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెప్పించారన్న ముఖ్యమంత్రి   
  • మొదటి సంవత్సరం మాత్రమే పాక్షికంగా తెప్పించామని కేటీఆర్ సమాధానం
  • రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడేననీ… పదేళ్లుగా మాత్రం చెడిందన్న కేటీఆర్

10 నెలలు కూడా పూర్తి కాని తమ పాలనపై కేటీఆర్ వందల ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య మాటల యుద్ధం సాగింది. 

  తనకు ఇచ్చిన సమయాన్ని సభను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ వినియోగించుకోవడానికి చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అనుభవాలు మీకున్నాయని… ప్రజల అనుభవాలు ప్రజలకు ఉన్నాయని… అందుకే ఆ ప్రజలే తమకు అధికారం కట్టబెట్టారన్నారు. ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని కేంద్రం చెబితే కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు.

బతుకమ్మ చీరలపై రేవంత్ వర్సెస్ కేటీఆర్

బతుకమ్మ చీరలను మీరు సిరిసిల్ల కార్మికులతో నేయించలేదని… వారికి పని ఇవ్వలేదని… సూరత్ నుంచి కొన్నారని నేను స్పష్టంగా ఆరోపిస్తున్నానని… దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభలో అధికారి పేరు తీయకూడదని (అంతకుముందు కేటీఆర్ సభలో ఓ అధికారి పేరు తీయడాన్ని ఉద్దేశించి) పెద్దపెద్ద చదువులు చదువుకున్న వారికి తెలుసో లేదో తనకైతే తెలియదని… కాని ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు తెలుసు అన్నారు. 610 జీవో ఉన్నా… ముల్కీ రూల్ ఉన్నా… తెలంగాణలోని ప్రతి ఉద్యోగానికి తనకు అర్హత ఉందని.. కానీ గుంటూరులో చదువుకున్న వారికి అర్హత ఉందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు.

తాను గుంటూరు కాలేజీలోనే చదువుకున్నానని.. కానీ 610 జీవో ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తుంది తప్ప ప్రైవేటు రంగానికి కాదని కేటీఆర్ అన్నారు. తాను ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేశానని… 610 జీవో వర్తించదని గుర్తించాలని సమాధానం చెప్పారు. ఇక బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెప్పించారని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ మొదటి సంవత్సరం మాత్రమే అక్కడి నుంచి కొంతమేర తెప్పించామన్నారు. సిరిసిల్లలో అప్పటికి అప్పుడు కోటి చీరలు చేయలేం కాబట్టి పాక్షికంగా అక్కడి నుంచి మొదటి సంవత్సరం మాత్రమే తెప్పించామన్నారు. ఇక తాను అధికారి పేరును తీసుకున్నానని… బిజినెస్ రూల్స్ చదివానని… అధికారిని ప్రత్యేక అటెండీగా పిలువవచ్చునన్నారు.

రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడే: కేటీఆర్

రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడేనని కేటీఆర్ అన్నారు. ఆయన పద్దెనిమిదేళ్లుగా తనకు తెలుసునన్నారు. గత పదేళ్ల నుంచి ఆయనకు, తమకు చెడిందన్నారు. పదేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినప్పుడు 1800 కోట్లు ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను విడుదల చేశామన్నారు.

Related posts

మీరు కేంద్రానికి మద్దతు ఇచ్చారు ..మీది చీకటి ఒప్పందం…రేవంత్ ,కేటీఆర్ మధ్య డైలాగ్ వార్!

Ram Narayana

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారింది: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Ram Narayana

లగచర్ల రైతులకు సంఘీభావంగా.. చేతుల‌కు బేడీల‌తో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

Ram Narayana

Leave a Comment