Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంక్రీడా వార్తలు

100 గ్రాముల అధిక బరువు… వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు…

  • 50 కిలోల విభాగంలో ఈ రోజు రాత్రి తలపడాల్సిన ఫొగాట్
  • 100 గ్రాములు అధికంగా బరువు ఉండటంతో అనర్హత వేటు
  • అనర్హత వేటు వార్తను పంచుకోవడం బాధాకరమన్న భారత ఒలింపిక్ సంఘం

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే బరువు పెరిగినట్లు తేలడంతో పతకం ఆశలు గల్లంతయ్యాయి. ఆమెపై అనర్హత వేటు పడింది. భారత బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఉదయం ఫొగాట్ 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది.

50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు కావాల్సిన బరువు కంటే ఆమె 100 గ్రాములు అధికంగా ఉందని, ఇది అనర్హతకు దారి తీయవచ్చునని సంబంధిత వర్గాలు అంతకుముందే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈరోజు ఆమె 50 కిలోలకు పైగా ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. ఫొగాట్ ఈ రోజు రాత్రి ఫైనల్‌లో తలపడాల్సి ఉంది. కానీ బరువు పెరగడంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. 

ఫొగాట్ 50 కిలోల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చిందని, కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడిందని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది. దయచేసి ఫొగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. అనర్హత వేటు వార్తను పంచుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది.

 నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌!: అనర్హత వేటుపై ప్రధాని మోదీ

PM Modi Reacts To Vinesh Phogat Disqualification From Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై చివ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. దీని పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఆమెను ఓదార్చుతూ ఓ ట్వీట్ చేశారు.

“వినేశ్‌, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఓ మార్గ‌ద‌ర్శి. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ నన్ను ఎంతగానో బాధించింది. దీనిపై విచారం వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు మరింత బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నాను. కఠినమైన సవాళ్లను ఎదిరించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం” అని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, వినేశ్ 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో పోటీ పడాల్సి ఉంది. దీంతో ఆమె బరువును చూసిన నిర్వాహకులు ఆమె అదనపు బరువు పెరిగినట్లు గుర్తించారు. 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ వినేశ్‌పై అనర్హత వేటు వేశాయి. దీంతో, ఫైనల్ లో ఆమె కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులు చేదు వార్తను వినాల్సి వ‌చ్చింది.

వినేశ్ ఫోగాట్ అనర్హతపై ఐఓఏ చీఫ్ తో మాట్లాడిన ప్రధాని మోదీ

PM Modi talks to IOA Chief PT Usha on Vinesh Phogat disqualification

మహిళల రెజ్లింగ్ లో 50 కిలోల కేటగిరీలో స్వర్ణం కానీ, రజతం కానీ ఏదో ఒక పతకం తీసుకువస్తుందని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై పెట్టుకున్న ఆశలు నిబంధనల కారణంగా ఆవిరయ్యాయి. నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందంటూ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

కాగా, వినేశ్ అనర్హతపై ప్రధాని మోదీ భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) చీఫ్ పీటీ ఉషతో ఫోన్ ద్వారా మాట్లాడారు. పారిస్ ఒలింపిక్స్ లో అసలేం జరిగింది? అంటూ పీటీ ఉషను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వినేశ్ ఫోగాట్ అనర్హతకు దారితీసిన అంశాలను పీటీ ఉష ప్రధానికి వివరించారు. 

వినేశ్ కు మనం ఏమైనా సాయపడగలమా? ఏమైనా మార్గాలు ఉన్నాయా? అని ప్రధాని అడిగారు. ఒకవేళ వినేశ్ కు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే, ఒలింపిక్స్ లో గట్టిగా నిరసన తెలపండి అంటూ పీటీ ఉషకు ప్రధాని మోదీ సూచించారు. వినేశ్ కు తమ పూర్తి మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు.

వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై భారత్ అప్పీల్!


వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై భారత్ అప్పీల్‌కు వెళ్లింది. అమెపై అనర్హత వేటు పడటంతో ప్రొటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసినట్లుగా తెలుస్తోంది. 50 కిలోల విభాగంలో ఈరోజు రాత్రికి ఆమె ఫైనల్‌లో తలపడాల్సి ఉంది. కానీ ఈరోజు ఉదయం ఆమె 50 కిలోల కంటే 100 గ్రాములు అధికంగా ఉంది. దీంతో ఒలింపిక్స్ అసోసియేషన్‌ ఆమెపై అనర్హత వేటు వేసింది. ఈ పరిణామంతో యావత్ భారతదేశం షాక్‌కు గురైంది.

‘తదుపరి ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తా’

వినేశ్ ఫొగాట్ బంగారు పతకం తీసుకు వస్తుందని యావత్ భారతం ఎదురు చూస్తోందని ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ అన్నారు. 50 కిలోల విభాగంలో ఈ రోజు రాత్రి ఫైనల్లో ఆమె పోటీ పడాల్సి ఉంది. కానీ 50 కిలోల కంటే 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.

ఈ నేపథ్యంలో మహావీర్ ఫొగాట్ స్పందిస్తూ… ఒలింపిక్స్‌లో రూల్స్ ఉంటాయని, కానీ ఎవరైనా రెజ్లర్ 50 లేదా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారన్నారు. దేశ ప్రజలు ఎవరూ నిరాశపడవద్దని కోరారు. ఆమె ఏదో ఒకరోజు తప్పకుండా మెడల్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెను తదుపరి ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తానన్నారు. 

‘నో… నో… నో… ఇది నిజం కాకపోతే బాగుండు’ అని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

అనర్హత వేటు తర్వాత ఆసుపత్రి పాలైన వినేశ్ ఫోగాట్

Vinesh Phogat hospitalised after Disqualification from Paris Olympics

భారత స్టార్ అథ్లెట్ వినేశ్ ఫోగాట్ అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆమె అనారోగ్యం బారిన ప‌డింది. దాంతో వినేశ్‌ను పారిస్ ఒలింపిక్ గ్రామంలోని ఓ క్లినిక్ లో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని సమాచారం. వినేశ్ ఇవాళ రాత్రి మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైన‌ల్స్ ఆడాల్సి ఉండ‌గా, 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా అన‌ర్హ‌త వేటు ప‌డింది. 

నిన్న బౌట్‌ సమయంలో ఆమె తన బరువు నియంత్రణలోనే ఉంచుకొన్నట్లు తెలుస్తోంది. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ రెండు కిలోల అధిక బరువు ఉన్నారు. దీంతో జాగింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ వంటి బరువు తగ్గేందుకు దోహదపడే క‌స‌ర‌త్తులు చేశారు.

అంతేకాకుండా భోజనం కూడా తీసుకోకుండా, బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా ఆమె నిద్రపోకుండా మేల్కొనే ఉన్నట్లు సమాచారం. దీని కారణంగానే వినేశ్ ఇప్పుడు డీహైడ్రేషన్‌కు గురైనట్లు క్రీడా వర్గాల స‌మాచారం. 

ఆమె ఒలింపిక్‌ గ్రామంలోని ఓ పాలిక్లినిక్ లో చికిత్స అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

“కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల అన‌ర్హ‌త‌ వేటు పడింది. దయచేసి వినేశ్‌ ఫోగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని కోరుతున్నాం. ఇది అత్యంత బాధాకరం” అని భారత ఒలింపిక్‌ సంఘం వెల్లడించింది.

వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు వెనుక కుట్ర ఉందన్న కాంగ్రెస్ ఎంపీ

Vinesh Phogat lost her medal because of conspiracy Congress MP Balwant Wankhede claimed

భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్‌పై ఆఖ‌రి నిమిషంలో అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో ఇవాళ రాత్రి ఆడాల్సిన మ‌హిళ‌ల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగం ఫైన‌ల్స్ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. 100 గ్రాముల అధిక బ‌రువు కార‌ణంగా ఆమెపై వేటు ప‌డిన విష‌యం తెలిసిందే. ఇది యావ‌త్ భార‌త్‌ను షాక్‌కు గురి చేసింది. త‌ప్ప‌కుండా ప‌త‌కం వ‌స్తుంద‌నుకున్న ఈవెంట్ నుంచి ఆమె ఇలా అర్ధాంత‌రంగా వైదొల‌గ‌డం తీవ్ర నిరాశ‌కు గురి చేసింది.  

తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ బ‌ల్వంత్ వాంఖ‌డే స్పందించారు. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేసినందుకు రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్ తన పతకాన్ని కోల్పోయారని వాంఖడే పేర్కొన్నారు. 

“ఇది చాలా బాధాకరమైన వార్త. దీని వెనుక ఏదో కుట్ర ఉంది. ఆమె జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడం దేశం మొత్తానికి తెలుసు. ఆమెకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆమె గెలిస్తే, వారు ఆమెను గౌరవించవలసి ఉంటుంది. ఇది వారికి ఇష్టం లేదు” అని చెప్పుకొచ్చారు. 

కాగా, తమ‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద వివాదాస్పద రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప‌లువురు అంతర్జాతీయ మ‌హిళా రెజ్లర్లలో వినేశ్ ఫోగాట్ ఒకరు. దాంతో రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను తొలగించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ కూడా ఇవ్వ‌లేదు. అయితే, ఆయన కుమారుడు బీజేపీ పార్టీ టికెట్‌పై ఆయన స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Related posts

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఆరేళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన అమెరికన్

Ram Narayana

వేలంలో భారీ ధర పలకనున్న ప్రిన్సెస్ డయానా తొలి వర్క్ కాంట్రాక్ట్…

Ram Narayana

విదేశాల్లోనే అత్యధిక యూనికార్న్‌లను స్థాపించిన భారతీయులు

Ram Narayana

Leave a Comment