- బీజేపీ, సీపీఎం విషప్రచారం చేస్తున్నాయని మండిపాటు
- కావాలంటే నన్ను తిట్టండి… కానీ రాష్ట్రాన్ని దూషించవద్దని విజ్ఞప్తి
- ఈ కేసులో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామన్న మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసు ఇప్పుడు సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో మమతా బెనర్జీ స్పందించారు.
ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని, అయినప్పటికీ కొంతమంది తమను తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తమపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే తనను తిట్టవచ్చునని… కానీ రాష్ట్రాన్ని దూషించవద్దని సూచించారు.
ఈ కేసులో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామన్నారు. కేసు త్వరగా పరిష్కారమై బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానన్నారు. బీజేపీ, సీపీఎం ఆందోళనలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. నిరసనలు చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని ఆమె విజ్ఞప్తి చేశారు.