- రాడిసన్ రెడ్ హోటల్‌లో బస చేసిన ఎయిర్ హోస్టెస్
- ఆమె గదిలోకి ప్రవేశించి దాడి చేసిన ఆగంతుకుడు
- ఆమె అరుపులు విని రక్షించిన సహచరులు
- ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా
లండన్‌లోని హీత్రూలో ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్‌పై దాడి జరిగింది. ఆమె బస చేసిన హోటల్‌లోకి దూరిన దుండగుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీనిపై ఎయిర్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హీత్రూలోని రాడిసన్ రెడ్ హోటల్‌లో బస చేసిన ఎయిర్ హోస్టస్ నిద్ర లేచి చూసే సరికి ఆమె గదిలో ఓ ఆగంతుకుడు కనిపించాడు. ఆ వెంటనే అతడు ఆమెపై దాడిచేసి నేలపై పడేసి ఈడ్చి పడేశాడు. దీంతో ఆమె అరుస్తూ గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెను మరోమారు వెనక్కి లాగి పడేసి దుండగుడు దాడి చేశాడు.
ఆమె అరుపులు విన్న పక్క గదిలోని సహచరులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆమెను రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. ఈ హోటల్‌లో భద్రతపై గతంలోనూ తాము ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. కాగా, బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్న విషయాన్ని ఎయిర్ లైన్స్ వెల్లడించలేదు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందించారు. ఎయిర్ హోస్టెస్‌పై ఆగంతకుడి దాడి తనను కలవరానికి గురిచేసిందని అన్నారు. సిబ్బంది భద్రతను ఎయిర్ ఇండియా పట్టించుకోకుండా వారిని ప్రమాదంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.