పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
-పాల్గొన్న కీలక నేతలు
-పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు
-ఖమ్మం లో సీఎల్పీ నేత భట్టి ఆధ్వరంలో ఆందోళన
-ఘట్‌కేసర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరసన
-హైదరాబాద్‌లో ఉత్తమ్ తో కలిసి కాంగ్రెస్ ఆందోళన
-జగిత్యాలలో జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతోన్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు తెలుపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.
ఒకవైపు కరోనా ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచేస్తూ మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైరా రోడ్ లోగల పెట్రోల్ బంక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వరంలో ఆందోళన జరిగింది. ఘట్‌కేసర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. హైదరాబాద్-వరంగల్ రహదారి పక్కన ఉన్న పెట్రోలు బంకు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్, దాసోజు శ్రవణ్ నిరసనలో పాల్గొన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆందోళనలు తెలుపుతున్నారు. జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మంలో జరిగిన ఆందోళనలో సీఎల్పీ నేత భట్టి
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా… ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్ వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీగారి పిలుపు మేరకు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేతతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వువ్వాళ్ల దుర్గా ప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, జిల్లా బీసీ నాయకలు పుచ్చకాయల వీరభద్రంతో పాటు నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.