- ఫార్మా కంపెనీల బాధితులను పరామర్శించిన జగన్
- పరిహారం చెల్లించకపోతే ధర్నా చేస్తానని హెచ్చరిక
- ఘాటుగా స్పందించిన అనిత
- జగన్ మాటలను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యలు
- కళ్లుండీ చూడలేరు, చెవులుండీ వినలేరు అంటూ వ్యంగ్యం
అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోంమంత్రి అనిత తప్పుబట్టారు. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఫార్మా ఘటన పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే తాను వెంటనే కోటి పరిహారం అందేలా చేశానని జగన్ చెప్పారు. ఇప్పుడు అచ్యుతాపురం బాధితులకు పరిహారం ఇవ్వకపోతే తాను వచ్చి ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలకు హోమంత్రి అనిత బదులిచ్చారు. బాధితులకు సాయం అందిందో, లేదో జగన్ నిర్ధారించుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే, జగన్ వచ్చాడని… కానీ ఎయిర్ పోర్టుకు వచ్చి, కంపెనీ యజమానులను అక్కడికే పిలిపించుకుని పరిహారం అక్కడ పెట్టేసి వెళ్లిపోయారని అనిత ఆరోపించారు.
గత ఐదేళ్ల కాలంలో 120 మంది చనిపోయారని, వారు చనిపోయినప్పుడు జగన్ వచ్చి కూర్చోలేదే అని వ్యాఖ్యానించారు. ఘటన జరిగి 24 గంటలు గడవకముందే చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించారని వెల్లడించారు. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షించి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.
ఎక్కువగా దెబ్బలు తగిలిన వారికి రూ.50 లక్షలు, ఓ మోస్తరు గాయాలైనవారికి రూ.25 లక్షలు ప్రకటించారని వెల్లడించారు. ఈ డబ్బును 24 గంటల్లోపు ఇవ్వాలని ఆదేశించిన తర్వాతే చంద్రబాబు ఇక్కడ్నించి వెళ్లారని అనిత వివరించారు.
తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ కు అలవాటేనని, నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని అనిత అన్నారు. ఏదో వచ్చాం, బురద చల్లాం అనే రీతిలో జగన్ పర్యటన ఉందని విమర్శించారు. అక్కడ జరిగిన ఘటనకు, ఇతను మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన కుదరడంలేదన్నారు.
అందుకే జగన్ మాటలను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని… “హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే” అంటూ అనిత తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కళ్లుండీ కొంతమంది చూడలేరు, చెవులుండీ కొందరు వినలేరు… ఈ రెండింటికీ సంబంధించిన బాపతే పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశారు.