- పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో కాంస్యం గెలిచిన దీప్తి జీవాంజి
- అరంగేట్ర పారాలింపిక్స్‌లోనే పతకంతో మెరిసిన తెలుగమ్మాయి
- ఎక్స్ వేదికగా దీప్తిపై ప్రశంసలు కురిపించిన ప్రధాని, రాష్ట్రపతి
పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్లో కాంస్య పతకం సాధించిన పారా అథ్లెట్, తెలుగమ్మాయి దీప్తి జీవాంజిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆమెకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చాలా మందికి దీప్తి స్ఫూర్తి అని కొనియాడారు.
పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో కాంస్యం గెలిచినందుకు దీప్తి జీవాంజికి అభినందనలు. ఆమె అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆటపై అంకితభావాన్ని ప్రదర్శించింది. భవిష్యత్‌లో ఆమె ఇంకా ఉన్నత విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
అద్భుతమైన ప్రదర్శనతో పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో కాంస్య పతకం గెలిచినందుకు దీప్తి జీవాంజికి శుభాకాంక్షలు. ఆమె చాలా మంది స్ఫూర్తికి మూలం. ఆటలో ఆమె నైపుణ్యం, పట్టుదల అభినందనీయం అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
అటు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీప్తిని అభినందించారు. ఆమె భవిష్యత్ మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఇక పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో 21 ఏళ్ల దీప్తి జీవాంజికి చివరి వరకు తోటి అథ్లెట్లకు గట్టిపోటీ ఇచ్చింది. కానీ, స్వల్ప తేడాతో రజతం కోల్పోయింది. ఆమె పరుగును 55.82 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది.
ఉక్రెయిన్‌కు చెందిన యులియా షులియార్ 55.16 సెక్లనతో బంగారం పతకం గెలవగా, తుర్కియే అథ్లెట్ ఐసెల్ ఒండర్ 55.23 సెకన్లతో రజతం కైవసం చేసుకుంది.
కాగా, దీప్తికి ఇవే అరంగేట్ర పారాలింపిక్స్ కావడం గమనార్హం. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామం. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దీప్తి, ఇలా అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఒలింపిక్స్ లో కాంస్యం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇదిలాఉంటే.. పారిస్ పారాలింపిక్స్‌లో మంగళవారం ఒకేరోజు భారత్ ఖాతాలో ఏకంగా 5 పతకాలు చేరాయి. దీంతో ఇప్పటివరకు గెలిచిన పతకాల సంఖ్య 20కి చేరింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఇన్ని మెడల్స్ గెలవడం ఇదే తొలిసారి.