Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ ట్యాంకరు డ్రైవర్ గా ఎంకామ్ అమ్మాయి!

పెట్రోల్ ట్యాంకరు డ్రైవర్ గా ఎంకామ్ అమ్మాయి!
కేరళలో లారీ స్టీరింగ్ చేతబట్టిన దెలిషా డేవిస్
వయసు 24 ఏళ్లు ఆమెలో పట్టుదల చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన అధికారులు
300 కిమీ అలుపు లేకుండా పెట్రోల్ ట్యాంకరు డ్రైవింగ్
అమ్మాయి అభిరుచికి తండ్రి ప్రోత్సాహం తోడు

లారీ డ్రైవింగ్ మగాళ్లే కాదు, తానూ చేయగలనని నిరూపిస్తోంది ఓ మగువ. 24 ఏళ్ల ఆ అమ్మాయి పేరు దెలిషా డేవిస్.. చదివింది ఎంకామ్. ఇప్పుడు లారీ డ్రైవింగ్ ను వృత్తిగా ఎంచుకుంది. కేరళలోని త్రిసూర్ కు చెందిన దెలిషా 300 కిలోమీటర్ల పాటు అలుపు సొలుపు లేకుండా డ్రైవింగ్ చేస్తూ, వృత్తిని ఎంతో ఆస్వాదించడం ఆశ్చర్యం కలిగించే విషయం. తాము అనుకున్నది చేసే ఇప్పటితరం అమ్మాయిలకు అచ్చమైన ప్రతినిధిలా కనిపించే దెలిషాకు డ్రైవింగ్ అంటే ప్రాణం.

ఆమె తండ్రి పీఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో, దెలిషా ఆ దిశగా ఆసక్తి పెంచుకుంది. డేవిస్ కూడా ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించారు. దెలిషా వారానికి మూడు పర్యాయాలు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు తీసుకెళ్లి మళ్లీ తిరిగొస్తుంది. ఇరుంబనం వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నుంచి చమురును తిరూర్ లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరు ద్వారా తరలించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పనిగా మారింది. గత మూడేళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ట్యాంకరు లారీని పరుగులు పెట్టిస్తోంది.

ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, దెలిషా లారీని కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు విస్మయానికి గురయ్యారు. సార్, ఓ చిన్న అమ్మాయి ట్యాంకరు లారీ నడుపుతోంది అంటూ తమ పై అధికారులకు సమాచారం అందించారు. ఆపై, దెలిషా డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికిల్), ప్రమాదకర వస్తువులు రవాణా చేసే లైసెన్స్, ఇతర అనుమతి పత్రాలు చూసి మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మాయి అయినప్పటికీ నిబ్బరంగా లారీ నడుపుతున్న తీరు చూసి అధికారులు సైతం ఆమెను అభినందించారు.

తొలుత టూ వీలర్ నడపడం నేర్చుకున్న దెలిషా, ఆపై ఫోర్ వీలర్ డ్రైవింగ్ ను కూడా నేర్చేసుకుంది. ఈ క్రమంలో తన తండ్రి నడిపే పెట్రోల్ ట్యాంకరు డ్రైవింగ్ ను కూడా కొద్దికాలంలోనే వంటబట్టించుకుంది. 16 ఏళ్ల వయసులోనే దెలిషా లారీ నడిపిందంటే ఆమె నైపుణ్యం, తపన ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.

మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలన్నది దెలిషా కల. అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. తండ్రి ప్రోత్సాహం వల్లే తాను లారీ డ్రైవర్ గా కొనసాగుతున్నానని, ఆయన వెన్నుతట్టకపోతే తాను డ్రైవింగ్ నేర్చుకుని ఉండేదాన్ని కాదని దెలిషా చెబుతోంది. తాను చదువును నిర్లక్ష్యం చేయలేదనీ, సాయంకాలం క్లాసులకు హాజరై ఎంకామ్ పరీక్షలు రాశానని, ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతోంది దెలిషా.

Related posts

కౌంటింగ్‌కు ఏపీ సన్నద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్…

Ram Narayana

యూపీలోని రాంపూర్ లో రాత్రుళ్లు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!

Drukpadam

ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు: హరీశ్ రావు తీవ్ర విమర్శలు

Ram Narayana

Leave a Comment