‘జగన్ బెయిల్ రద్దు‘ పిటిషన్పై విచారణ:.. రిజాయిండర్ దాఖలు చేసిన రఘురామ..
–విచారణ జులై 1 కి వాయిదా
–ఇప్పటికే జగన్ తరఫు న్యాయవాదుల కౌంటర్ దాఖలు
–దానిపైనే రఘురామ రిజాయిండర్
–కౌంటర్లో జగన్ అసత్యపు ఆరోపణలు చేశారని వ్యాఖ్య
–తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమన్న రఘురామ
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్పై ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై ఇప్పటికే జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసి, ఈ పిటిషన్ను కొట్టేయాలని కోరిన విషయం తెలిసిందే. అయితే, ఆ కౌంటర్పై రఘురామకృష్ణరాజు రిజాయిండర్ దాఖలు చేశారు. దీంతో కోర్ట్ మరోసారి కేసు విచారణకోసం వాయిదా వేసింది.
కౌంటర్లో జగన్ అసత్యపు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమని తెలిపారు. పిటిషన్ విచారణ అర్హతలపై కోర్టులు ఇప్పటికే స్పష్టతనిచ్చాయని వివరించారు. రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదని జగన్ పేర్కొనడం సరికాదన్నారు. తనపై కేవలం ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, చార్జిషీట్ దాఖలు చేయలేదని ఆయన వివరించారు.
జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు. కాగా, వాదనలకు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో జులై 1కి విచారణను వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది.