మహా వికాస్ అఘాడీలో కుదిరిన సీట్ల సర్దుబాటు.. సీట్ల షేరింగ్ ఇలా..!
- కూటమిలోని మూడు పార్టీలకు 85 సీట్ల చొప్పున పంపకం
- మిగిలిన 33 సీట్లు చిన్న మిత్రపక్షాలకు కేటాయింపు
- 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంపకంపై ఒక స్పష్టత వచ్చింది. కూటమిలోని మూడు ప్రధాన పార్టీలు.. ఉద్దవ్ ఠాక్రే శివసేన (యూబీడీ), కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్) పార్టీలు సమానంగా సీట్లు పంచుకున్నాయి. రాష్ట్రంలోని 288 సీట్లకు గానూ ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించాయి. మిగిలిన 33 సీట్లలో కూటమిలోని చిన్న మిత్రపక్షాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరక గత కొన్ని రోజులుగా ఎంవీఏ కూటమిలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్‌కి మద్య చిన్నపాటి మాటల యుద్ధం కూడా నడిచింది. విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి ఠాక్రే వర్గం మరో ఎనిమిది సీట్ల కోసం పట్టుబట్టింది. మొత్తంగా యూబీటీ 17 సీట్లను కాంగ్రెస్ నుంచి కోరడంతో సీట్ షేరింగ్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో సీట్ల షేరింగ్ వివాదానికి తెరపడినట్లు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే శివసేన ఠాక్రే వర్గం 65 మందితో అభ్యర్ధుల తొలి జాబితాను రిలీజ్ చేసింది.