తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ తో విచారణకు సిద్ధం
-కేసీఆర్ సిద్ధమైనా? ఆరోపణల్లో నిజంలేకపోతే ముక్కునేలకు రాష్ట్రారా ?
-టీఆర్ యస్ పార్టీ కుటంబ పార్టీనా ? ఉద్యమ పార్టీనా ?
-టీఆర్ యస్ పార్టీకి అందరు వారసులే అనే ఆనాడే చెప్పా
-ప్యూడల్ ప్రభువులా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.
-పార్టీలో కనీస ప్రజాస్వామ్యం లేదు … అన్ని నియంత విధానాలే
-డబ్బుతో ఎన్నికల్లో గెలవడం …కేసీఆర్ అలవాటుగా చేసుకున్నారు
-పూర్తీ మెజార్టీ వచ్చిన ఇతర పార్టీల వారిని కొనడం ఏరకమైన విలువలకు తార్కాణం
-నాడు ఒక ముఖ్యమంత్రి ఇదే పని చేస్తే దుర్మార్గం అని నిలదీయలేదా ?
-హుజురాబాద్ లో పార్టీ వల్లనే డబ్బులు పెట్టి కొంటున్నారు … ఇదెక్కడి నీతి
-వందల కోట్లు గుమ్మరించిన హుజురాబాద్ ప్రజలను కొనలేవు
-హుజురాబాద్ లో గెలిచి కేసీఆర్ దుష్ట రాజకీయాలను బొందపెడతాం
–ఢిల్లీ మీడియా సమావేశంలో మాజీమంత్రి ఈటల కేసీఆర్ పాలనపై నిప్పులు
గులాబీ దళం నుంచి కమలం వనంలోకి ప్రవేశించిన మాజీ మంత్రి తాజా బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా దమ్ము దైర్యం ఉంటె తనపై చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ తో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. తన సవాల్ స్వీకరించాలని అదే సందర్భంలో కేసీఆర్ ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన పై విచారణలో ఆయన చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఆరోపణలు తప్పని తేలితే ముక్కు నెలకు రాస్తారా ? అని ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయం లో బీజేపీ లో చేరిన అనంతరం ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ,బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ విధానాలపై నిప్పులు చెరిగారు .
ఎమ్మెల్యేలు , మంత్రులు అన్నా కనీస గౌరవ మర్యాదలు ఇవ్వని కేసీఆర్ నిజస్వరూపం అందరికి తెలుసునని అన్నారు. ఎమ్మెల్యేలను కనీసం మనుషుల్లా కూడా చూడని నైజం కేసీఆర్ ది అని ధ్వజమెత్తారు . తెలంగాణ కోసం కొట్లాడింది తెలంగాణ సమాజం అయితే దాన్ని అనుభవిస్తుంది కేసీఆర్ కుటుంబమని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. అసలు టీఆర్ యస్ ఉద్యమ పార్టీనా ? కేసీఆర్ కుటుంబపార్టీనా ? అని ప్రశ్నించారు. పార్టీలో ఉన్న అనేకమంది అనేక అవమానాలు భరించారు. నేను ఏనాడో చెప్పా టీఆర్ యస్ పార్టీకి ఏ ఒక్కరు వారసులు కాదని అందరం వారసులమేనని చెప్పున విషయాన్నీ గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలమందరం కలిసి ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్ళితే గేటు లోపలకు కూడా రానివ్వని విషయాన్ని ప్రస్తావించారు. ఆనాడే ఇది ప్రగతి భవన్ కాదు బానిసల నిలయం అని పేరు మార్చుకోండని ఎంపీ సంతోష్ కు చెప్పిన విషయాన్నీ గుర్తు చేశారు. రెండవసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా మూడు నెలలుగా ఒక్క ముఖ్యమంత్రే పరిపాలన చేశారని అది ఆయన నియంత ధోరణికి నిదర్శనం అని తీవ్ర ఆరోపణలు చేశారు. అది ఆయన నియంతృత్వ చర్యలకు పరాకాష్ట అని అన్నారు. ప్యూడల్ ప్రభువులా తన పరిపాలన సాగుతుందని విమర్శించారు . ఆయన అనుకున్నదే జరగాలనే ధోరణి మంత్రుల మాటకు విలువలేదు. చివరకు అధికారులకు కూడా కనీస మర్యాద ఇవ్వని ముఖ్యమంత్రి గా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని దుయ్యబట్టారు .
పార్టీ లో ప్రజాస్వామ్యం లేదు … ప్రభుత్వంలో సమిష్టి నిర్ణయాలు లేవు . ఆయన నంది అంటే నంది పంది అంటే పంది ధోరణి అని కేసీఆర్ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఏ ఎన్నిక వచ్చిన డబ్బుతో గెలవాలనే ధోరణి తప్ప తన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించటం ద్వారా గెలవాలనే ఆలోచన ఏ మాత్రం లేదని అన్నారు. సాగర్ ఎన్నికైన, ఎమ్మెల్సీ ఎన్నికలయిన డబ్బు సంచులు పంపించడం ఓటర్లను కొనుగోలు చేసేందుకు తన మనుషులను పంపడం అలవాటుగా మారిందని అన్నారు. ఇదే ప్రయోగాన్ని హుజురాబాద్ లో చేయాలనీ చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ వాళ్ళనే కొనుగోళ్ళు చేస్తున్నారని పార్టీ వాళ్ళని కొనడం నేది ఎక్కడైనా ఉన్నదా అని ఈటల ప్రశ్నించారు.
రెండసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ నించి గెలిచినవాళ్లను కొనుగోలు చేసు ప్రజాస్వామ్యాన్ని పాతర వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధ్వజమెత్తారు . మొదటి సారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ,టీడీపీ నుంచి గెలిచినవారిని కొనుగోళ్లు చేసిన విషయాన్నీ ప్రస్తావించారు. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఇదే పని చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే దుర్మార్గం అన్న మనమే వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనటం ఏరకమైన న్యాయం అని ఆనాడే చెప్పినట్లు తెలిపారు. రేపు జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు గుమ్మరించి గెలవాలని చూస్తున్నారని కాని హుజురాబాద్ ప్రజలు నీతికి,నిజాయతీకి కట్టుబడి ఉండేవాళ్ళని నీ డబ్బు సంచులు , ప్రలోభాలకు లొంగరని ఈటల ను తిరిగి గెలిపించుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. హుజూరాబా ఏపీఎన్నికతోనే కేసీఆర్ కు రాజకీయసమాది ఖాయమని అన్నారు. వామపక్ష వాది అయిన మీరు బీజేపీ లో ఎలా చేరారని ప్రశ్నించగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ యస్ ను బొందబెట్టేందుకు సరైన వేదిక బీజేపీ అని భావించే ఇందులో చేరానని అన్నారు . రాష్ట్ర వ్యాపితంగా ఉన్న ఉద్యమకారులు , మాజీ ఎంపీపీలు , జడ్పీటీసీలు ,అందరిని ఐక్యం చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ చేతుల్లో నుంచి కాపాడుకుంటామని పూర్తీ విశ్వాసం ఉందని అన్నారు. విలేకర్ల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కే అరుణ , మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి , దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు , ఏనుగు రవీందర్ రెడ్డి తుల ఉమా , గండ్ర నళిని , ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులూ అశ్వత్తమ రెడ్డి , కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.