పులివెందులలో తమకు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరిన వివేకా కుమార్తె సునీత
-2019లో వివేకా హత్య …ఇప్పటికీ తేలని కేసు
-కొనసాగుతున్న సీబీఐ విచారణ
-తమకు ముప్పు ఉందంటున్న వివేకా కుమార్తె సునీత
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి (68) గత ఎన్నికల ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పటికీ తేలలేదు. తాజాగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత నేడు కడప జిల్లా ఎస్పీని కలిశారు. పులివెందులలో తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముప్పు ఉందని భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. తన ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాయ్ కుమార్తె ,ముఖ్యమంత్రికి సోదరి అయిన సునీతా ఎస్పీ ని కలవడం భద్రతా కల్పించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది .
వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. సీబీఐకి చెందిన ఓ బృందం కడపలోనే మకాం వేసి అనుమానితులను ప్రశ్నిస్తూ కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది. 2019 మార్చి 15న వివేకా పులివెందులలోని తన నివాసంలో తీవ్ర గాయాలతో విగతజీవుడై పడి ఉండడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పెద్ద రాజకీయ దుమారమే రేగింది. ఈ కేసును అప్పట్లో టీడీపీ గాని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంగాని తేల్చలేకపోయింది.