- గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
- మధ్యాహ్నం 12.45 గంటలకు మృతి చెందారని వైద్యుల ప్రకటన
- రామ్మూర్తినాయుడు వయసు 72 సంవత్సరాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చికిత్స పొందుతున్న ఆయన… ఈ ఉదయం గుండెపోటుకు గురయ్యారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 14 ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. రామ్మూర్తినాయుడు వయసు 72 సంవత్సరాలు.
ఇప్పటికే నారా లోకేశ్, పురందేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
1994లో టీడీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తినాయుడు గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయనకు భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. నారా రోహిత్ సినీ హీరో అనే విషయం తెలిసిందే.
మా నుంచి దూరమై… మా కుటుంబంలో ఎంతో విషాదం నింపాడు: చంద్రబాబు
- తమ్ముడు రామ్మూర్తి పార్థివదేహాన్ని చూసి చలించిపోయిన చంద్రబాబు
- తనను విడిచి వెళ్లిపోయాడంటూ ఆవేదన
- పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని వ్యాఖ్య
తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపటి క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు… తన తమ్ముడి పార్థివదేహానికి నివాళి అర్పించారు. నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసి చలించిపోయారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… తమ్ముడు రామ్మూర్తినాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని చెప్పారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
మరోవైపు రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెలో రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.