- శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం గుండె
- ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేసే అవయవం
- పరిస్థితిని బట్టి గుండె కొట్టుకునే వేగంలో పెరుగుదల, తగ్గుదల
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. మిగతా అవయవాల్లో ఏమైనా తేడాలు వచ్చినా… శరీరం కొంతవరకు తట్టుకోగలదు. కానీ గుండె పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా… శరీరంలోని అన్ని అవయవాలు, భాగాలపై ప్రభావం పడుతుంది. అలాంటి గుండె రోజూ ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా?
ఎండ, వేడి, చలి వంటి వాతావరణ పరిస్థితుల్లో… వివిధ మానసిక ఉద్వేగాల సమయంలో… శరీరంలో అనారోగ్య పరిస్థితులలో… ఇలా ఎన్నో సమయాల్లో గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. వీటన్నింటినీ సగటుగా తీసుకుని, మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందనే దానిపై అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
ఆ అధ్యయనం వివరాల మేరకు…
- ఆరోగ్యవంతులైన యుక్త వయసు వారి గుండె నిమిషానికి 60 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది. అదే చిన్న పిల్లల్లో ఇది 70 నుంచి 150 వరకు ఉంటుంది. వారి వయసు పెరిగిన కొద్దీ వేగం తగ్గుతుంది.
- ఈ క్రమంలో శాస్త్రవేత్తలు నిమిషానికి 70 సార్లు గుండె కొట్టుకోవడాన్ని సగటు ప్రామాణికంగా తీసుకున్నారు.
- దీని ప్రకారం గుండె ఒక రోజులో… ఒక లక్షా 800 సార్లు కొట్టుకుంటుంది. ఒక ఏడాదిలో 3,67,92,000 (మూడు కోట్ల 67 లక్షల 92 వేల) సార్లు కొట్టుకుంటుంది.
- ఒక మనిషి జీవితకాలం 75 ఏళ్లు అనుకుంటే… 275,94,00,000 సార్లు (275 కోట్ల 94 లక్షల సార్లు) గుండె కొట్టుకుంటుంది.
- మన గుండె ఇంత కష్టపడుతూ మనం ప్రాణాలతో ఉండేలా చేస్తుంది. అలాంటప్పుడు గుండెను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా! అని వైద్య నిపుణులు చెబుతున్నారు.