- నెలాఖరులో మాజీ సీఎంను విచారణకు పిలవనున్న కమిషన్
- ఇప్పటికే ప్రాజెక్టులో పనిచేసిన అధికారుల విచారణ పూర్తి
- ఈ నెల 21 హైదరాబాద్ కు జస్టిస్ పీసీ ఘోష్ రాక
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారులను విచారించిన కమిషన్.. ఈ నెలాఖరున మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21 న మరోసారి హైదరాబాద్ కు చేరుకోనుంది. వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? అనేది సందేహాస్పదంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తొలుత పనిచేసిన అధికారులు.. మాజీ సీఎస్ లు ఎస్కే జోషి, సోమేశ్ కుమార్ లతో పాటు రజత్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ తదితరులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.