- పుష్ప2 ‘ఆలిండియా ఇండస్ట్రీ హిట్’ అన్న వర్మ
- అల్లు అర్జున్, చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఆర్జీవీ
- అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా అంటూ వ్యాఖ్య
యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘పుష్ప2‘ సినిమా సందడి మొదలైంది. ఇవాళ (గురువారం) ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12 వేలకుపైగా స్క్రీన్లపై ఈ మూవీ విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ ఎక్కడా వినిపించడం లేదు. అల్లు అర్జున్ నటన అద్భుతానికి మించిపోయిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూవీ చూసిన వారు చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయారు.
పుష్ప2 ‘ఆలిండియా ఇండస్ట్రీ హిట్’ సాధించిందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్‌తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ‘‘అల్లు అర్జున్ ఈజ్ మెగా మెగా మెగా మెగా మెగా’’ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.
అంతకుముందు ‘పుష్ప-2’ సినిమా విడుదల సందర్భంగా బుధవారం పెట్టిన ఓ పోస్టులోనూ హీరో అల్లు అర్జున్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని, కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని కితాబునిచ్చాడు.
థియేటర్‌లో అల్లు అర్జున్‌కు అభిమానుల స్టాండింగ్ ఒవేషన్.. వీడియో వైరల్!
- సంధ్య థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి పుష్ప-2 చూసిన అల్లు అర్జున్
- గంగమ్మ జాతర సీన్‌లో ఆయన నటనను చూసిన అభిమానుల స్టాండింగ్ ఒవేషన్
- దాంతో వారికి కృతజ్ఞతలు తెలిపిన బన్నీ
ఐకాన్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందిన ‘పుష్ప2: ది రూల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బుధవారం రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు ఇవాళ మార్నింగ్ షోలు కూడా పడిపోయాయి. దీంతో థియేటర్ల వద్ద బన్నీ ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది.
కాగా, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని సంధ్య థియేటర్‌లో ఫ్యామిలీ, అభిమానులతో కలిసి అల్లు అర్జున్ నిన్న రాత్రి ఈ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా గంగమ్మ జాతర సీన్‌లో ఆయన నటనను చూసిన అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దాంతో బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. మనం విజయం సాధించామంటూ విక్టరీ సింబల్‌తో అభివాదం చేశారు. ప్రస్తుతం దీని తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ మూవీకి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన వారు సినిమా బాగుందని అంటున్నారు. గంగమ్మ జాతర ఎపిసోడ్ మూవీలో టాప్‌నాచ్ అని టాక్. మరోవైపు బుధవారం సాయంత్రం నుంచి పుష్ప-2, అల్లు అర్జున్, వైల్డ్‌ఫైర్ పుష్ప హ్యాష్ ట్యాగ్‌లు ఎక్స్ (ట్విట్టర్)లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.