- ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్న ఠాక్రే
- అందుకే నిరసనగా ఈరోజు ప్రమాణం చేయడం లేదని వెల్లడి
- ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రజలు ఏమాత్రం సంతృప్తిగా లేరని శివసేన (యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు. నేటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎంవీఏలో భాగమైన శివసేన (యూబీటీ) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం లేదని తెలిపారు. ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.
అందుకు నిరసనగా తాము ఈరోజు ప్రమాణ స్వీకారానికి దూరం జరుగుతున్నట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే వారు సంతోషంగా ఉండేవారని, కానీ వారిలో ఆ సంతోషం కనిపించడం లేదన్నారు. మహాయుతి కూటమి గెలిచిన విజయోత్సవాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు.
ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్పందించారు. ఆదిత్య చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రతిపక్ష కూటమి నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అవసరమైతే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నారు. కాగా, ఈ రోజు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా పలువురు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.