- రేపు ఉదయం పదిన్నరకు విచారణకు హాజరు కావాలని ఆదేశం
- మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు
- నోటీసులు జారీ చేసిన రాచకొండ సీపీ
మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం గం.10.30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మంచు మనోజ్, మంచు విష్ణులకు కూడా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, రాచకొండ పోలీసుల ఆదేశాల మేరకు మోహన్ బాబు, మంచు మనోజ్ లైసెన్స్ డ్ తుపాకులను ఫిలింనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన ఇంటి వద్ద జర్నలిస్ట్‌ల మీద మోహన్ బాబు దాడి చేసినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు
నటుడు మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి ఆయన కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మరోవైపు, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ పలువురు జర్నలిస్టులు కాంటినెంటల్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.