- దేశం అభివృద్ధి చెందాలని నిరంతరం కోరుకుంటానన్న మమతా బెనర్జీ
- తన సారథ్యం కోరుకునే కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపిన బెంగాల్ సీఎం
- అవకాశమిస్తే కూటమిని సమర్థవంతంగా నడిపిస్తానని వ్యాఖ్య
ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని… కాబట్టి దానిని నడపాల్సిన బాధ్యత తనపై ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలని, ప్రజలు బాగుండాలని తాను నిరంతరం కోరుకుంటానన్నారు. తనపై గౌరవంతో, నమ్మకంతో కూటమికి సారథ్యం వహించాలని కోరుకునే కూటమి నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో పలువురు ఇండియా కూటమి నేతలు.. రాహుల్ గాంధీ వైపు కాకుండా మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ… తనకు అవకాశమిస్తే కూటమిని సమర్థవంతంగా నడిపిస్తానని వ్యాఖ్యానించారు.
ఆమె ప్రకటనపై సమాజ్‌వాది, ఆర్జేడీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీల నేతలు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో మమతా బెనర్జీ ఓ మూలస్తంభమని, కూటమి నేతలమంతా కూర్చొని నాయకత్వం గురించి మాట్లాడుకుంటామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారి అన్నారు. మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నామని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నేత సంజయ్ రౌత్ అన్నారు. మమత నాయకత్వంలో ప్రతిపక్ష కూటమి ముందుకు వెళ్లాలని తాము కోరుకుంటున్నామని లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.