- అమిత్ షా తప్పుకోవాలన్న అరవింద్ కేజ్రీవాల్
- మహిళలకు అప్పగిస్తే ఢిల్లీ సమస్యలను సరి చేస్తారని వ్యాఖ్య
- కేంద్రం ద్రవ్యోల్బణం పెంచుకుంటూ పోతుంటే, తాము ఉచితంగా ఇస్తున్నామన్న కేజ్రీవాల్
ఢిల్లీని మేనేజ్ చేయడం మీకు చేతకాకుంటే ఆ విషయాన్ని అంగీకరించి తప్పుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ సూచించారు. నగరంలోని 1.25 కోట్ల మంది సోదరీమణులకు అప్పగిస్తే వారు ఢిల్లీ సమస్యలన్నింటినీ సరిచేస్తారన్నారు. ప్రస్తుతం అమిత్ షా చేతిలో పవర్ ఉంటే… మహిళలు బాధితులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయని, ఒకటి కేజ్రీవాల్‌ది అయితే రెండోది కేంద్ర ప్రభుత్వమన్నారు. పాలు, కూరగాయలు, పప్పులు, బియ్యం ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిందని ఆరోపించారు. వారు ద్రవ్యోల్బణం పెంచుకుంటూ పోతుంటే తమ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు అన్నీ ఉచితంగా వచ్చేలా చేస్తోందన్నారు.
ఎన్నికల తర్వాత మహిళల ఖాతాల్లో తాము వేయబోయే రూ.2,100ను కూడా కేంద్రం తప్పుబడుతోందని ఆరోపించారు. డబ్బు వృథా చేస్తున్నారంటోందని, మహిళలు బాగుపడటం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వద్ద ఎలాంటి అజెండా లేదని ఎద్దేవా చేశారు.