Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అంజయ్యా.. నేను మీ ఊరికి వస్తున్నా!: వాసాలమర్రి గ్రామ సర్పంచికి సీఎం కేసీఆర్ ఫోన్!

అంజయ్యా.. నేను మీ ఊరికి వస్తున్నా!: వాసాలమర్రి గ్రామ సర్పంచికి సీఎం కేసీఆర్ ఫోన్!
-ఈ నెల 22న యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటన
-వాసాలమర్రి గ్రామానికి రాక
-గ్రామంలో సామూహిక భోజనాలకు కేసీఆర్ ఆసక్తి
-సర్పంచి అంజయ్యకు దిశానిర్దేశం
-భోజనాల అనంతరం భారీ సభ
-ఆశక్తికరంగా కేసీఆర్ సర్పంచ్ అంజయ్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణ

సీఎం కేసీఆర్ ఈ నెల 22న యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. తుర్కపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాసాలమర్రి గ్రామంలో పర్యటించేందుకు నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచి అంజయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. తాను పర్యటనకు వస్తున్నానని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఫోన్ కాల్ ద్వారా సంభాషణ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇవిగో…

సీఎం కేసీఆర్: నమస్తే అంజయ్య, బాగున్నావా?

సర్పంచి: నమస్తే సార్… బాగున్నాను సార్!

సీఎం కేసీఆర్: అంజయ్యా… నేను ఈ నెల 22 మీ ఊరికి వస్తున్నా. కొన్నిరోజుల ముందు రావాలనుకున్నాను కానీ… ఈ లోపున నాకు కరోనా వచ్చి, దేశమంతా కరోనా వచ్చి రాలేకపోయాను. గతంలో వస్తానని మాటిచ్చాను కాబట్టి వస్తున్నాను.

సర్పంచి: తప్పకుండా రండి సార్!

సీఎం కేసీఆర్: ఈ నెల 22న వస్తున్నాను. అయితే నువ్వు మీ ఊర్లో రెండు ప్రదేశాలు చూడాలి. ఒకటి మీ ఊరు వాళ్లందరితో కలిసి నేను భోజనం చేసేందుకు జాగా చూడాలి. రెండోది నా సభకు అనువైన స్థలం చూడాలి. ఈ రెండు స్థలాలను నువ్వు ఎంపిక చేయాలి.

సర్పంచి: అలాగే సార్.

సీఎం కేసీఆర్: అంజయ్యా… మీ ఊర్లో ఎంత మంది జనాభా ఉంటారు?

సర్పంచి: 2,600 మంది ఉంటారు సార్.

సీఎం కేసీఆర్: నేను వచ్చిన రోజున వారందరికీ భోజనం పెడుతున్నాం. భోజనం ఏర్పాట్లకు హైదరాబాద్ నుంచి ముందే ఓ టీమ్ వస్తుంది. వాళ్లకు నువ్వు స్థలం చూపించాలి. ఇక నాతో పాటు 200 మంది వస్తారు. పోలీసులు ,ఇతర సిబ్బంది అందరికీ కలిపి భోజనం ఏర్పాటు చేయిద్దాం. అదంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడొద్దు. కలెక్టర్ వచ్చి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తారు. నువ్వు చేయాల్సింది భోజనానికి, నా సభకు రెండు జాగాలు చూపించాలి. ఈ రెండు జాగాల్లో రెయిన్ ఫ్రూఫ్ టెంట్లు వేయించాలి. ఆ ఏర్పాట్లు కలెక్టర్ చూసుకుంటారు.

సర్పంచి: అలాగే సార్.

సీఎం కేసీఆర్: కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా ఈ భోజనాలు ఉంటాయి.. వాళ్లందరితో కూర్చుని నేను కూడా భోజనం చేస్తాను.

సర్పంచి: అలాగే సార్. ఊరి బయట హాస్టల్ వద్ద ఓ వ్యక్తికి చెందిన 30 ఎకరాల స్థలం ఉంది సార్. అందులో భోజనాలు పెడదాం. అక్కడైతే మీతో పాటు వచ్చేవారికి ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్.

సీఎం కేసీఆర్: అలాగే కానివ్వు అంజయ్యా. అయితే, భోజనాలు చేసే స్థలానికి, సభ ఏర్పాటు చేసే స్థలానికి దూరం ఉండాలి. నా వరకైతే ఇబ్బంది లేదు. బాత్రూం గట్రా ఉండే బస్సు కూడా నాతో వస్తుంది.

సర్పంచి: అలాగే సార్. నాదో రిక్వెస్టు సార్. వాసాలమర్రి వస్తున్న మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి సార్. ఒకప్పుడు రెండు పూటల తిండికి కూడా నోచుకోని మేం మీ జెండాతోనే ఎదిగాం. మా కుటుంబానికి మీ ఆశీస్సులు కావాలి సార్.

సీఎం కేసీఆర్: తప్పకుండా వస్తా అంజయ్యా. భోజనాలు అయ్యాక మీ ఇంటికి వెళదాం. భోజనం చేసిన జనాలు అక్కడి నుంచి సభ ఏర్పాటు చేసిన స్థలానికి హ్యాపీగా వెళతారు. మీ ఇంటి వద్ద ఓ ఐదు నిమిషాలు గడిపి మనం కూడా సభకు వెళదాం.

సర్పంచి: థాంక్యూ సార్.

సీఎం కేసీఆర్: ఈ పర్యటనలో ఎలాంటి చిల్లర రాజకీయాలు ఉండవు. అందరినీ కలుపుకుని పోవాలి.

సర్పంచి: నాకు అలాంటివేమీ లేవు సార్.

సీఎం కేసీఆర్: నీక్కాదు నేను చెప్పేది. అందరికీ. వేరే పార్టీ వాళ్లను కూడా కలుపుకుని పోవాలి.

సర్పంచి: ఓకే సార్.

సీఎం కేసీఆర్: సర్పంచిగా బాగా కష్టపడి పనిచేయి! మంచి పేరొస్తుంది.

సర్పంచి: తప్పకుండా సార్. మీ ఆశీస్సులతో బాగా పనిచేస్తాను సర్.

Related posts

ఏపీ సీఎం జగన్ కు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఫోన్ !

Drukpadam

ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ మరోసారి ఎన్నిక!

Drukpadam

కరోనా నేపథ్యంలో ఎన్నికల సభలు రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ

Drukpadam

Leave a Comment