సిపిఎం జిల్లా కార్యదర్శిగా తిరిగి నున్నా
42 మందితో కమిటీ ..11 మందితో కార్యదర్శి వర్గం …
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జరిగిన సిపిఎం జిల్లా మహాసభల్లో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు …కార్యదర్శిగా తిరిగి నున్నా నాగేశ్వరరావు ఎన్నికకాగా 11 మందితో కార్యదర్శివర్గన్ని , 42 మందితో కార్యవర్గాన్ని ఎన్నికున్నారు ఈసభలకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరైయ్యారు..
అమిత్ షా దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి..
- అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు కండన
- కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపు
- అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్థించడం సరికాదు
- సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా 22వ మహాసభల సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. దళితుల వెనుకబాటుతనాన్ని, అంటరానితనాన్ని తీవ్రంగా ప్రశ్నించి, తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాలకు అంకితం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అమిత్ షా అంబేద్కర్ ను పలుచన చేస్తూ వ్యాఖ్యలు చేయడం, వాటిని ప్రధానమంత్రి మోడీ సమర్ధించడాన్ని తమ్మినేని ఖండించారు. సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా 22వ మహాసభలకు పరిశీలకులుగా హాజరైన తమ్మినేని మహాసభల ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ ప్రజలను ఎలా పాలించాలో సమానత్వ సిద్ధాంతాన్ని కూడా ముందుకు తీసుకువచ్చింది అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దళితులకు రిజర్వేషన్ కేటాయింపులో అంబేద్కర్ కృషి ప్రత్యేకమైనది అన్నారు. ఇంత చరిత్ర ఉన్న ఓ మహనీయున్ని చులకన చేస్తూ మాట్లాడటాన్ని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ మార్పు అనేది బీజేపీ లక్ష్యమని, దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలనే యోచనలో భాగంగానే అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని తమ్మినేని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్ప మరొకటి కాదన్నారు . పైపెచ్చు కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్ధించడంపై మండిపడ్డారు. హోంమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకట్, పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, భూక్యా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
- అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో మహాసభల ప్రాంగణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ ఎదుట గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మకు నిప్పంటించి అనంతరం మాట్లాడారు. అంబేద్కర్ దళిత హక్కులు, అంటరానితనం నిర్మూలన కోసం పోరాడిన విషయాన్ని ప్రస్తావించారు. దేశ ప్రజలకు ఓ రాజ్యాంగం ఉంది.. దీనిలో సమానత్వ ప్రతిపాదనలు అనేకం ఉన్నాయని వెల్లడించారు. ఆర్థిక అసమానతలు రూపుమాపాలని, లౌకికతత్వం పాటించాలని, ప్రజాస్వామ్యం కాపాడబడాలని, రాజ్యాంగ సంస్థలను స్వతంత్ర ప్రతిపత్తితో నడపాలనే ప్రతిపాదనలు రాజ్యాంగంలో పొందుపరిచినట్లు వివరించారు. దేశ ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులను కల్పించిన చరిత్ర అంబేద్కర్ దని తెలిపారు. అటువంటి అంబేద్కర్ ను అవమానించడం అమిత్ షా దురహంకారానికి నిదర్శనంగా పేర్కొన్నారు. అంబేద్కర్ పై అమిత్ షాక్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సీపీఐ (ఎం) 22వ మహాసభల్లో తీర్మానం చేశామని వెల్లడించారు. మహాసభల అనంతరం ఉరూరా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు
- ప్రపంచవ్యాప్తంగా పాలకవర్గాలపై వ్యతిరేకత
- సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్
ప్రపంచవ్యాప్తంగా పాలకవర్గాలపై వ్యతిరేకత కొనసాగుతోందని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్ తెలిపారు. కమ్యూనిస్టులకు అనుకూల వాతావరణం నెలకొన్న దృష్ట్యా దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ ఖమ్మం జిల్లా 22వ మహాసభలను ఉద్దేశించి ఆయన గురువారం మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులలో అభద్రతాభావం పెరిగిందన్నారు. కులం, మతం పేరుతో ప్రజలను వర్గీకరిస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పాలకవర్గాల మీద వ్యతిరేకత కొనసాగుతుందని, కమ్యూనిస్టులు అనుకూలమైన పరిణామాలు నెలకొన్నాయన్నారు. దానికి ఉదాహరణే శ్రీలంకలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం అని తెలిపారు. కమ్యూనిస్టులు జనంతో గడుపుతూ వర్గ పోరాటాలను ముందుకు తీ సుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. పార్టీ బలోపేతం ద్వారా వర్గ పోరాటాలను మరింతగా ముందుకు తీసుకెళ్లవచ్చు అని తెలిపారు. అస్థిత్వ రాజకీయాల్లోకి కమ్యూనిస్టులు ప్రవేశించవద్దని సూచించారు. మార్క్సిస్టు దృక్పథంతో సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ప్రజలతో మరింతగా మమేకమవుతూ ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
=====================================