Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

పరగడపున వేడి నీళ్లా, చల్లటి నీళ్లా… ఏవి తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

  • కొందరు ఉదయమే గోరు వెచ్చని నీళ్లు తాగాలని చెబుతారు
  • మరికొందరు మామూలు చల్లటి నీళ్లు తీసుకోవడం మంచిదంటారు
  • ఈ రెండింటితో కూడా వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

పొద్దున పరగడుపునే ఒకట్రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అందరూ అంగీకరించే విషయమే. అయితే గోరు వెచ్చని నీళ్లు తాగితే ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు, కొందరు వైద్యులు చెబుతుంటారు. మరోవైపు కాస్త చల్లటి నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మరి ఉదయమే చల్లటి నీళ్లు తాగాలా? గోరు వెచ్చని నీళ్లు తాగాలా? అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. అయితే ఈ రెండింటి వల్ల వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయని… అవసరాన్ని బట్టి తీసుకోవడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం…

గోరు వెచ్చని నీటితో ప్రయోజనాలు ఏమంటే…
రోజూ పొద్దున పరగడుపునే గోరు వెచ్చని నీటిని తాగితే… జీర్ణ వ్యవస్థ పరిశుభ్రమవుతుంది. ఎంజైముల విడుదలను పెంచి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
గోరు వెచ్చని నీరు తాగడం వల్ల పొట్టలో ఉబ్బరం, గ్యాస్ సమస్య, మలబద్ధకం వంటివి తగ్గుతాయి.
యురోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం… గోరు వెచ్చని నీరు తాగితే చెమట, మూత్ర విసర్జన పెరిగి శరీరం నుంచి విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.
గోరు వెచ్చని నీటి కారణంగా శరీరంలో రక్త నాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరంలోని అవయవాలు, కణజాలాలకు ఆక్సిజన్, గ్లూకోజ్ బాగా అందుతుంది. ఉత్సాహంగా ఉంటుంది.
సాధారణంగానే వెచ్చదనం మన శరీరానికి విశ్రాంతి కలిగిన భావన ఇస్తుంది. అలా గోరు వెచ్చని నీరు కూడా రిలాక్సేషన్ కు తోడ్పడుతుంది.

ఉదయమే చల్లటి నీళ్లు తాగితే వచ్చే ప్రయోజనాలు ఏమంటే…
గతంలో క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం జర్నల్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం… ఉదయమే పరగడుపున చల్లటి నీళ్లు తాగడం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చల్లటి నీరు తాగిన అనంతరం… శరీరం ఆ నీటి ఉష్ణోగ్రతను మన శరీర ఉష్ణోగ్రతకు పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొంత శక్తి ఖర్చవుతుంది.
మామూలుగానే కాస్త చల్లటి పదార్థాలు మనకు రిఫ్రెష్ అయిన ఫీలింగ్ ఇస్తాయి. అందుకే ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింకులు తీసుకుంటూ ఉంటాం. అదే తరహాలో ఉదయమే కాస్త చల్లటి నీటిని తాగడం వల్ల రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గోరు వెచ్చని నీటి కంటే చల్లటి నీటిని మన శరీరం వేగంగా సంగ్రహించుకుంటుందని… శరీరంలో నీటి నిల్వ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం గానీ, శారీరక కష్టంగానీ చేసిన తర్వాత చల్లటి నీళ్లు తాగితే… శరీరం హైడ్రేట్ అవుతుందని, రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుందని చెబుతున్నారు.
చల్లటి నీళ్లు కూడా జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయని, ఆ నీటితో కలసిన పోషకాలను శరీరం బాగా సంగ్రహించుకుంటుందని వివరిస్తున్నారు.

Related posts

బీపీ చెక్​ చేసుకుంటున్నారా… సరైన రీడింగ్​ రావాలంటే ఇలా చేయాలి!

Ram Narayana

ఆహారం ఫుల్లుగా తిన్నా బరువు పెరగకూడదనుకుంటే ఈ 5 డ్రింక్స్ తాగితే చాలు !

Ram Narayana

ప్యాకెట్ పాలను మరగబెట్టాకే తాగాలా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Ram Narayana

Leave a Comment