మాది రైతుప్రభుత్వం –ధాన్యాగారంగా తెలంగాణ :సిద్దిపేటలో కేసీఆర్
–రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు
–సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
–పలు భవనాలకు ప్రారంభోత్సవం
–అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని వెల్లడి
–ఎవరేమనుకున్నా పట్టించుకోబోమని స్పష్టీకరణ
–కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
–కేసీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టించకుండా చర్యలు
–కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాల నేతల అరెస్టు
–ఒకే రోజు రెండు జిల్లాలలో పర్యటన అధికారుల ఉక్కిరిబిక్కిరి
ముఖ్యమంత్రి కేసీఆర్ చాల రోజుల తరువాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు …. ఒక్క రోజులోనే రెండు జిల్లాలు పర్యటించడం బహుశా ఎన్నకల తరువాత ఇదేనేమో ….. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇక అధికారులకు ముచ్చమటలే ….. బందో బస్తు …. చెప్పాల్సిన పనిలేదు …..ముందస్తు అరెస్టులు …… షరామామూలే …. దీనితో ఉక్కిరిబిక్కిరిగా అధికారయంత్రాంగం పరుగులు …. కామారెడ్డి లో బీజేపీ ,కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయా పార్టీలు స్పందించాయి. ముఖ్యమత్రి పర్యటన సందర్భంగా వినతులు వినతులు ఇవ్వడం కూడా నేరమా అని ప్రశ్నించారు…..
తొలుత సిద్ధిపేట పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ నిర్మించిన పలు భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎవరేమనుకున్నా తాము పట్టించుకోవడంలేదని, తమ పని తాము చేసుకుపోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు.
తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో ముందున్న పంజాబ్ ను కూడా అధిగమించామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ వస్తోందని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తోలు తీయాలని అధికారులకు నిర్దేశించారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు.
ధరణి పోర్టల్ గురించి చెబుతూ, రాష్ట్రంలో భూఅక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. ఒక్కసారి ధరణి పోర్టల్ లో భూమి వివరాలు నమోదైతే, ఆ భూమి సొంతదారు ఇక నిశ్చింతగా ఉండొచ్చని పేర్కొన్నారు. వీఆర్ఓ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎవ్వరూ ఆ వివరాలను మార్చే వీల్లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంలో 37 చట్టాలున్నాయని, ఎలాంటి లొసుగులకు తావులేని విధంగా ధరణి పోర్టల్ ను పకడ్బందీగా రూపొందించేందుకు మూడేళ్లు శ్రమించామని తెలిపారు.
అత్యాధునిక హంగులతో జీ 1తో ఎకరం విస్తీర్ణంలో కట్టిన బంగళాను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను ఆఫీసు కోసం, మొదటి అంతస్తును నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆయన కొండపాక మండలం రాంపల్లి శివారులో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. అక్కడ ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆ తర్వాత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాలనూ ప్రారంభించారు. పూజలు చేసి వాటిని ఓపెన్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్టులు
ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టించకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని కొందరు నేతలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి . కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు అక్కడ నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు . పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు .