పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత పోరు …..ఆందోళన లో హైకమాండ్ !
– తారస్థాయికి చేరిన విభేదాలు
-సిద్ధూ, అమరీందర్ ఒకరిపై ఒకరు విమర్శలు
-నేడు ఢిల్లీకి వెళ్లిన సీఎం అమరీందర్
-తనపై పార్టీ తలుపులు మూసేయడానికి అమరీందర్ ఎవరు
-ప్రశ్నించిన సిద్ధూ
-అమరీందర్ ఎన్నికల్లో గెలవకలేకపోయారని ఎద్దేవా
అసలే కాంగ్రెస్ దేశంలో బలహీన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నవేళ పంజాబ్ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. …. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న తరుణంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం తో పార్టీ హైకమాండ్ లో ఆందోళన వ్యక్తం అయింది….
పంజాబ్‌లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. సీఎం అమరీందర్ సింగ్, పార్టీ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమస్యలను పరిష్కరిస్తే తాను సీఎంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధూ తెలిపారు. గత నాలుగేళ్లుగా వీరిరువురికి మధ్య సంబంధాలు చెడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ మధ్య సిద్ధూ సమస్యల్ని పరిష్కరించేందుకు అమరీందర్ సైతం మొగ్గుచూపినట్లు కనిపించింది.
వీరిరువురి మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేసిన వివాద పరిష్కార కమిటీ నేడు అమరీందర్ సింగ్‌ను రెండోసారి ఢిల్లీకి పిలిపించింది. మీకు తలుపులు మూసేసే పనిని అమరీందర్ తలకెత్తుకున్నారని భావిస్తున్నారా? అని సిద్దూని ప్రశ్నిస్తే, తనకు పార్టీ తలుపులు మూసేయడానికి అమరీందర్ సింగ్ ఎవరంటూ సిద్ధూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరీందర్ మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. సోనియా గాంధీయే ఆయన్ని పార్టీ అధ్యక్షుణ్ని చేసిందన్నారు. ఓ దశలో పార్టీని చీలుస్తానని కూడా బెదిరించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 117 స్థానాలున్న అసెంబ్లీలో 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని సిద్ధూ చెప్పుకొచ్చారు.
తన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అమరీందర్ సింగ్ అనడాన్ని సిద్ధూ తప్పుబట్టారు. తాను పార్టీలో నిజమైన సైనికుడినని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తనకు నామమాత్రపు బాధ్యతలు అప్పజెప్పారని ఆరోపించారు. తాను ప్రచారం చేసిన 56 స్థానాల్లో 54 చోట్ల కాంగ్రెస్ గెలుపొందిందన్నారు.