- ఆప్ కు రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు
- నేడు కాషాయ కండువాలు కప్పుకున్న వైనం
- ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కేవలం 4 రోజుల సమయం ఉందనగా, కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి నిన్న రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు నేడు బీజేపీలో చేరారు. వందనా గౌర్, రోహిత్ మెహ్రాలియా, గిరీశ్ సోని, పవన్ శర్మ, మదన్ లాల్, రాజేశ్ రిషి, భూపిందర్ సింగ్ జూన్, నరేశ్ యాదవ్ కాషాయ కండువాలు కప్పుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ కు పంపించినట్టు వారు వెల్లడించారు. వీరంతా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా సమక్షంలో బీజేపీలో చేరారు.
ఆశ్చర్యకర విషయం ఏమిటంటే… ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టికెట్లు దక్కలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వీరి స్థానంలో కొత్త వారికి టికెట్లు ఇచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.