జగన్ కేసుల ఎత్తి వేతపై సుమోటాగా విచారణ చేపట్టిన ఎపి హైకోర్టు
ఫాల్స్, మిస్టేక్ ఆఫ్ లా అంటూ జగన్‌పై ఎత్తేసిన కేసుల వివరాలు!
తీవ్ర చర్చనీయాంశమైన పాత కేసుల ఎత్తివేత
గతేడాది డిసెంబరు 16 నుంచి మొదలైన కేసుల క్లోజింగ్
వివిధ కారణాలు చూపుతూ కోర్టుల్లో క్లోజర్ రిపోర్టులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో నమోదైన పాత కేసులను ఎత్తివేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. తప్పుడు కేసులు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా, ఆధారాలు లేవన్న కారణంతో ఆయా న్యాయస్థానాల్లో క్లోజర్ రిపోర్టులు దాఖలు చేశారు. విచారణ అవసరం లేకుండానే వాటికి ముగింపు పలికారు. గతేడాది 16వ తేదీ తర్వాతి నుంచి ఈ కేసుల ఎత్తివేత సాగింది. ఈ నేపథ్యంలో ఆ కేసుల పూర్వాపరాలేంటో ఒకసారి చూద్దాం.
1. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, శత్రుత్వం పెంచేలా జగన్ ప్రసంగించారన్న ఎ. వెంకటేశ్వరరావు, తోట ముసలయ్య, వై భాగ్యారావు, కర్రి ప్రభాకర్‌రావు, ఆర్. సాంబశివరావు, డి. వీరాంజనేయులు ఫిర్యాదుపై 9 మార్చి 2016లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పుడు కేసు పేరుతో దీనిని ఎత్తేశారు.
2. అనంతపురం జిల్లా కదిరిలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో జగన్ మాట్లాడుతూ.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును చచ్చే వరకు చెప్పులతో కొట్టాలని ప్రసంగించి ప్రజలను రెచ్చగొట్టారని కమ్మవారిపాలేనికి చెందిన దాడెం వెంకట శివారెడ్డి ఫిర్యాదుతో 5 జూన్ 2016లో నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని మిస్టేక్ ఆఫ్ లా గా పేర్కొంటూ కేసును ముగించారు.
3. 3 జూన్ 2016లో అనంతపురం జిల్లా యాడికిలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో జగన్ మాట్లాడుతూ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలని రెచ్చగొట్టారని టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన వేలేరు రంగయ్య ఫిర్యాదు చేశారు. చర్యల ఉపసంహరణ పేరుతో ఈ కేసును పోలీసులు ఎత్తివేశారు.
4. అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం కృష్ణపాడులో రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ, అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారన్న కొండూరుకు చెందిన కేశవరెడ్డి ఫిర్యాదుతో 3 జూన్ 2016లో కేసు నమోదైంది. దీనిని కూడా చర్యల ఉపసంహరణ పేరుతో ఎత్తివేశారు.
5. 5 జూన్ 2016లో అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారన్న తమ్మినేని పవన్ కుమార్ ఫిర్యాదుతో ఆ తర్వాతి రోజు అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా ఆధారాలు లేవన్న కారణంతో కేసును ముగించారు.
6. ప్రజల్ని రెచ్చగొట్టేలా జగన్ ప్రసంగం ఉందంటూ బ్రహ్మణపల్లికి చెందిన బోయ రామాంజనేయులు ఫిర్యాదుపై 3 జూన్ 2016న పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని కూడా పోలీసులు ఎత్తివేశారు.
7. 9 అల్లర్లకు పాల్పడ్డారని, మారణాయుధాలు కలిగి ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించడంతోపాటు నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ వై. అన్నయ్య చేసిన ఫిర్యాదు మేరకు 9 అక్టోబరు 2011లో పులివెందులలో జగన్‌పై కేసు నమోదైంది. ఇది తప్పుడు కేసంటూ ఎత్తివేశారు. హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసుల్లో ఇది లేదు.
8. నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల ద్వారా అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీయడం, చట్ట విరుద్ధంగా సెల్‌ఫోన్ సందేశాలను తెసుకునేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలపై 8 జూన్ 2015లో చిలకలూరిపేట టౌన్‌లో గొర్రపాటి వెంకట హనుమ ప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. తప్పుడు కేసుగా పేర్కొంటూ దీనిని క్లోజ్ చేశారు. ఇది కూడా హైకోర్టు సుమోటో కేసుల పరిధిలో లేదు.
9. పైన పేర్కొన్న అభియోగాలతోనే అదే రోజు వేల్పుల సింహాద్రి యాదవ్ ఫిర్యాదుతో నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని కూడా ఫాల్స్ కేసు పేరుతో ఎత్తేశారు.
10. 28 ఫిబ్రవరి 2017లో కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. జగన్, కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను తదితరులు.. ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న గదిలోకి చొరబడి మహిళా వైద్యాధికారిని అడ్డుకున్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆమెను హెచ్చరించారంటూ డాక్టర్ కేవీ లక్ష్మీకుమారి చేసిన ఫిర్యాదు మేరకు అదే రోజు నందిగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని కూడా మిస్టేక్ ఆఫ్ లా గా పేర్కొంటూ ఎత్తివేశారు. ఈ కేసు కూడా హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసుల జాబితాలో లేదు.