- ప్రతిపక్ష హోదా ఇవ్వడం ప్రభుత్వ నిర్ణయమన్న హర్ష కుమార్
- గతంలో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారన్న మాజీ ఎంపీ
- గ్రూప్-2 పరీక్ష అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని విమర్శ
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ నేతలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని కూటమి నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? లేదా? అనేది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు.
గతంలో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రూప్-2 పరీక్ష అభ్యర్థులను సీఎం చంద్రబాబు మోసం చేశారని అన్నారు. చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ ఆడియో విడుదల చేసి గ్రూప్-2 పరీక్ష విషయంలో డ్రామా ఆడారని విమర్శించారు. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గ్రూప్-2 అభ్యర్థులు గుణపాఠం చెపుతారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ చేత అన్నీ అబద్ధాలే చెప్పించారని వ్యాఖ్యానించారు.