- ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు
- తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్య
- అమెరికా అధ్యక్షుడికి వరుసగా కోర్టుల్లో ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫెడరల్ జడ్జి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపులపై సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలోని వివిద ఏజెన్సీలు నియమించుకున్న ఉద్యోగులను తొలగించే హక్కు ట్రంప్ సర్కారుకు లేదని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఖర్చులను, దుబారాను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయాలని ట్రంప్ సర్కారు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)ని ఏర్పాటు చేసిన ట్రంప్ దానికి ఎలాన్ మస్క్ ను సలహాదారుగా నియమించారు. డోజ్ ఇటీవల ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. మాస్ ఫైరింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన జడ్జి తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉద్యోగుల నియామకాలు, తొలగింపుల అధికారం ఆయా ఏజెన్సీలకు మాత్రమే ఉందని, డోజ్ జారీ చేసిన తొలగింపుల ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ కు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శరణార్థులకు ఆశ్రయం కల్పించబోమని ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు బ్లాక్ చేసింది. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను మరో కోర్టు సస్పెండ్ చేసింది. తాజాగా ఉద్యోగుల మాస్ ఫైరింగ్ ఉత్తర్వుల విషయంలోనూ కోర్టు అభ్యంతరం తెలిపింది.