ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో రచ్చకెక్కిన విభేదాలు.. రెండుగా చీలిపోయిన డైరెక్టర్లు
-ఆసుపత్రిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నరసరాజు వర్గంపై ఆరోపణలు
-అది అమ్మడం సాధ్యం కాదన్న నరసరాజు
-అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్
-రాఘవరావు, ఉపేంద్రనాథ్, మణిలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో డైరెక్టర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. రెండుగా చీలిపోయిన డైరెక్టర్లలో ఓ వర్గం ఆసుపత్రి అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం తమకు ఆసుపత్రిని విక్రయించాలన్న ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. నిన్న ఆసుపత్రి డైరెక్టర్లు వేర్వేరుగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఒక కమిటీకి పోలవరుపు రాఘవరావు అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, మంతెన నరసరాజును మరో వర్గం అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కొందరు సభ్యులకు డబ్బులు ఎరవేయడం ద్వారా, మరికొందరిని భయపెట్టడం ద్వారా నరసరాజు వర్గం ఆసుపత్రిని ఆసుపత్రిని అమ్మేందుకు ప్రయత్నిస్తోందని రాఘవరావు వర్గం ఆరోపించింది. దీనిని ఖండించిన నరసరాజు వర్గం తమకు అలాంటి ఆలోచనే లేదని, ప్రస్తుత కమిటీపై వస్తున్న నిధుల దుర్వినియోగం ఆరోపణపలపై విచారణ జరిపి నిజాలు బయటపెడతామని పేర్కొంది.
మరోవైపు, తమదే అసలైన వర్గమని రాఘవరావు పేర్కొన్నారు. ముక్కామల అప్పారావు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రెండు రోజుల క్రితం నిర్వహించిన అత్యవసర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆయనను కార్యదర్శి పదవి నుంచి తప్పించినట్టు చెప్పారు. నరసరాజు కమిటీకి చట్టబద్ధత లేదని, కాలేజీని అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు.
ఆసుపత్రిని అమ్మేస్తున్నామన్న ప్రచారం సరికాదని రెండో కమిటీ నూతన అధ్యక్షుడు నరసరాజు అన్నారు. ఆసుపత్రి సొసైటీ కింద ఉందని, దానిని అమ్మడం సాధ్యం కాదని పేర్కొన్నారు. నిజానికి తమకు అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి అవకతవకలపై దేశంలోనే అగ్రశ్రేణి ఫైనాన్సింగ్ ఏజెన్సీలతో ఆడిట్ చేయించాలని, అలా అయితేనే విశ్వసనీయత ఉంటుందన్నారు.
కాగా, ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు రాఘవరావు, ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, కోశాధికారి అక్కినేని మణిలను అరెస్ట్ చేయొద్దని మంగళగిరి రూరల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సొసైటీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఈ నెల 19న ఓ వ్యక్తి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్ఆర్ఐ సర్వసభ్య సమావేశానికి వెళ్లకుండా తమను అడ్డుకునే ఉద్దేశంతోనే తప్పుడు కేసుపెట్టారంటూ వారు అత్యవసరంగా హైకోర్టును ఆదేశించారు. దీంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.