—
మయన్మార్, థాయ్ లాండ్ ను వణికించిన పెను భూకంపం అణుబాంబుల విధ్వంసానికి సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకంగా 334 అణుబాంబులు విస్పోటనం చెందితే ఎంత శక్తి విడుదలవుతుందో, ఈ భూకంపం సంభవించినప్పుడు అంతటి శక్తి వెలువడిందని భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. టెక్టానిక్ ఫలకాలు, యురేషియన్ ఫలకాలు వరుసగా ఢీ కొంటుండడం వల్ల మయన్మార్, థాయ్ లాండ్ లలో నెలల తరబడి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
భూకంపం సంభవించిన తర్వాత కూడా దాని ప్రభావం కొంతసేపు కొనసాగుతుంది. స్వల్ప స్థాయిలో పలుమార్లు భూమి కంపిస్తుంది. దీనినే ఆఫ్టర్ షాక్స్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. మయన్మార్ లో కేవలం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి 1644 మంది మరణించగా, 3 వేలకు పైగా ప్రజలు గాయపడ్డారు. భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకొని ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.