- ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయన్న కేటీఆర్
- వాటిని చూసి నెమళ్లు సాయం కోసం ఎదురు చూస్తున్నాయన్న కేటీఆర్
- కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన కేటీఆర్
హైదరాబాదులోని హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల విలువైన స్థలాన్ని ధ్వంసం చేస్తూ పచ్చదనంపై దాడి చేస్తున్నారని, ఆ ప్రాంతంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయని, వాటిని చూసి నెమళ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నెమళ్లు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి సమీపంలోని భూముల్లో జేసీబీలు, బుల్డోజర్ల ఉన్న ఫొటోలను, రాత్రి వేళల్లో అక్కడి చెట్లను తొలగిస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.
హెచ్‌సీయూ సమీపంలోని గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవన్నీ చూస్తూ కూడా రాహుల్ గాంధీ మౌనం వహిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ఇవి ప్రభుత్వ భూములే: టీజీఐఐసీ
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని టీజీఐఐసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందులో హెచ్‌సీయూ భూమి లేదని తెలిపింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ఇది అటవీ శాఖ భూమి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఐఐసీ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే నమోదై ఉందని వెల్లడించింది. అక్కడ నెమళ్లు, ఇతర జంతువులు లేవని తెలిపింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ఈ ప్రాజెక్టు కట్టుబడి ఉందని పేర్కొంది.
400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక ప్రకటన

- కంచ గచ్చిబౌలిలోని భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ ప్రకటన
- టీజీఐఐసీ ప్రకటనను ఖండించిన హెచ్‌యూసీ
- ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదన్న సెంట్రల్ యూనివర్సిటీ
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్పందించింది. టీజీఐఐసీ ప్రకటనను హెచ్‌సీయూ ఖండించింది. ఈ మేరకు హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్‌సీయూకి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆ భూమిని విశ్వవిద్యాలయానికే ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నామని, భూమి కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.