Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

కుమార్తె పెళ్లికి పది రోజుల ముందు.. కాబోయే అల్లుడితో అత్త పరార్!

  • ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఘటన
  • ఇప్పటికే శుభలేఖలు పంచేసిన కుటుంబం
  • ఇంట్లోని డబ్బు, నగలతో ఉడాయించిన అత్త 
  • కాబోయే అల్లుడితో తన భార్య రోజుకు 22 గంటలు మాట్లాడేదన్న భర్త 
  • ఆమె ఏమైనా ఇక పట్టించుకోబోనని శపథం

పది రోజుల్లో కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే అల్లుడితో అత్త పరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిందీ ఘటన. శివానీకి మరో పది రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే శుభలేఖలు పంచేశారు. పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత జరిగిన ఘటన ఒక్క శివానీ, ఆమె కుటుంబాన్ని మాత్రమే కాదు, గ్రామస్థులనే షాక్‌కు గురిచేసింది. శివానీ తల్లి అనిత కాబోయే అల్లుడు రాహుల్‌తో పరారైంది. అనిత పరారు కావడమే కాదు.. ఇంట్లోని రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు నగలతో ఉడాయించింది.

ఏప్రిల్ 16న తన వివాహం జరగాల్సి ఉందని, తనకు కాబోయే భర్తతో తన తల్లి ఆదివారం పరారైందని శివానీ తెలిపింది. గత మూడు నాలుగు నెలలుగా రాహుల్, తన తల్లి ఫోన్‌లో విపరీతంగా మాట్లాడుకుంటున్నారని పేర్కొంది. అల్మారాలో ఉన్న రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు నగలతో తన తల్లి పారిపోయిందని చెప్పింది. పది రూపాయలు కూడా ఇంట్లో వదలకుండా మొత్తం ఊడ్చుకుపోయిందని వివరించింది. ఆమె ఏం చేసుకున్నా తమకు సంబంధం లేదని, అయితే, ఇంట్లోంచి తీసుకెళ్లిన డబ్బు, బంగారు నగలు వెనక్కి ఇవ్వాలని శివానీ కోరింది. 


శివానీ తండ్రి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ తనకు బెంగళూరులో వ్యాపారం ఉందని తెలిపారు. కాబోయే అల్లుడితో అనిత గంటల తరబడి మాట్లాడుతుండటాన్ని గమనించానని, కానీ, త్వరలో వివాహం జరుగనుండటంతో ఏమీ అనలేకపోయానని పేర్కొన్నారు. అల్లుడు తన కుమార్తెతో కాకుండా తన భార్యతో మాట్లాడేవాడని జితేంద్రకుమార్ చెప్పారు. రోజులో 22 గంటలు ఫోన్‌లో మాట్లాడుకునే వారని గుర్తు చేసుకున్నారు. తనకు అనుమానం వచ్చినా కుమార్తె వివాహం ఉందన్న కారణంతో ఏమీ అనలేకపోయానని చెప్పారు. ఏప్రిల్ 6న రాహుల్‌తో అనిత వెళ్లిపోయిందని వివరించారు. 

తాను చాలాసార్లు ఫోన్ చేశానని, కానీ అనిత ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుందని జితేంద్ర తెలిపారు. రాహుల్ కూడా ఫోన్ ఆఫ్ చేసుకున్నాడని పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ఆమెతో బాధలు పడుతున్నానని, కాబట్టి ఇప్పుడామెను మర్చిపోతానని చెప్పారు. మిస్సింగ్ కేసు పెట్టానని పోలీసులు త్వరలోనే వారిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.  

Related posts

సుబ్రహ్మణ్యంపై పాము పగ.. బయటకొస్తే కాటే!

Ram Narayana

కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలుడు.. పొట్టలో 56 వస్తువులు…

Ram Narayana

మీరు ఎప్పుడు చనిపోతారో ఈ యాప్ ఇప్పుడే చెప్పేస్తుందట!

Ram Narayana

Leave a Comment