- ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించే ప్రసక్తే ఉండదన్న చైర్మన్ అబ్దుల్ అజీజ్
- బోర్డు నుంచి వచ్చే ప్రతి రూపాయి పేద ముస్లింలకు చెందాలన్నదే సీఎం ఆలోచనని వెల్లడి
- వక్ఫ్ బోర్డుకు చెందిన వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయన్న అబ్దుల్ అజీజ్
ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమిస్తారనే ప్రచారాన్ని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఖండించారు. విజయవాడలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే స్పష్టత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ప్రతి రూపాయి పేద ముస్లింలకు చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆస్తులను మూడేళ్లకు మించి లీజుకు ఇవ్వాలంటే బోర్డు సమ్మతితో పాటు ముతవల్లీ, ప్రభుత్వం అంగీకారం కూడా తప్పనిసరి అని ఆయన తెలిపారు.
వక్ఫ్ బోర్డుకు చెందిన వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని ఆయన అన్నారు. 30 వేల ఎకరాలను లీజుకు ఇచ్చి తద్వారా ఆదాయం పెంచి ముస్లింల అభివృద్ధికి వినియోగించాలనేది తమ ఆలోచన అని ఆయన చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు బోర్డులో తీర్మానం చేసి ఆసక్తి కనబరిచే వారిని ఆహ్వానించామని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన వెల్లడించారు.