- మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తప్ప, కొనుగోళ్లు జరపడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం ఆయన సత్తుపల్లి మున్సిపాలిటీ, మండల పార్టీ ముఖ్య నేతలతో ఈ నెల 27న వరంగల్లులో జరగనున్న పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ సింగరేణి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుని వాడుకుంటుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నిధులను ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేశామని చెప్పారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని, కేసీఆర్ పాలనలో పచ్చగా కళ కళలాడిన పల్లే ప్రకృతి వనాలు ఇప్పుడు ఎండి పోయాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు నరికేసినా పట్టించుకునే నాథుడు లేడని, హెచ్ సీయూలో పర్యావరణం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద గతంలో చీరతో పాటు లక్ష చెక్కు ఇచ్చే వాళ్ళమని, ఇప్పుడు కళ్యాణ లక్ష్మీ లేదు, షాది ముబారక్ లేదన్నారు. అధికారంలోకి రావడం కోసం దళితులకు, రైతులకు కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరుపుదామనే ఆరాటమే తప్ప, వారికి అభివృద్ధి మీద దృష్టి లేదన్నారు. ఇది వాయిదాల ప్రభుత్వం తప్ప అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదన్నారు. ఈ నెల 27న వరంగల్లులో జరిగే పార్టీ రజతోత్సవ సభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా సండ్ర రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశం ప్రారంభానికి ముందు వనజీవి రామయ్య మృతికి కొద్ది సేపు మౌనం పాటించారు.