- అమెరికాలోని అలబామాలో ఘటన
- పంది కిడ్నీతో 130 రోజులు జీవించి రికార్డు సృష్టించిన టోవానా లూనీ
- జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటివరకు 2 నెలలకు మించి బతకని వైనం
- గతేడాది నవంబర్ 25న లూనీకి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు
అమెరికాలోని అలబామాలో మెడికల్ మిరాకిల్ జరిగింది. టోవానా లూనీ అనే మహిళ పంది కిడ్నీతో 130 రోజులు జీవించి రికార్డు సృష్టించారు. ఓ జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటివరకు రెండు నెలలకు మించి బతకలేదు. గతేడాది నవంబర్ 25న లూనీకి పంది కిడ్నీ అమర్చారు.
అయితే, ఇటీవల ఆమెలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతో వైద్యులు ఇటీవల ఆపరేషన్ నిర్వహించి ఆ కిడ్నీని విజయవంతంగా తొలగించారు. ఏప్రిల్ 4న న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్ సెంటర్‌లో జరిగిన తొలగింపు శస్త్రచికిత్స తర్వాత ఆమె బాగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
ఇకపై ఆమె మళ్లీ డయాలసిస్ చేయించుకోనున్నారు. ఆమెకు సరిపోయే మనిషి కిడ్నీ దొరికాక అమర్చుతామని వైద్యులు తెలిపారు. లూనీ 2016 నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ఈ సందర్భంగా టోవానా లూనీ మాట్లాడుతూ… “పంది కిడ్నీతో నా 130 రోజుల జీవితం నుంచి చాలా నేర్చుకున్నాను. ఇది మూత్రపిండాల వ్యాధిని అధిగమించే ప్రయాణంలో చాలా మందికి సహాయపడుతుంది, ప్రేరణనిస్తుంది” అని ఆమె అన్నారు.
కాగా, లూనీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందు కేవలం నలుగురు అమెరికన్లకు మాత్రమే ఇలా పంది అవయవాల (జన్యు-సవరించిన) ప్రయోగాత్మక జినోట్రాన్స్‌ప్లాంట్లు జరిగాయి. వాటిలో రెండు హృదయాలు, రెండు మూత్రపిండాల మార్పిడిలు ఉన్నాయి. ఈ నాలుగు సందర్భాల్లోనూ రెండు నెలల కంటే ఎక్కువ కాలం ఆ అమర్చిన అవయవాలు పనిచేయలేదు. శస్త్రచికిత్సకు ముందు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆ గ్రహీతలు మరణించడం జరిగింది.
దాంతో ఇప్పుడు పరిశోధకులు లూనీ లాంటి కొంచెం తక్కువ అనారోగ్యం ఉన్న రోగులకు ఇలా జంతు అవయవాల మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 2025 జనవరిలో పంది కిడ్నీ అమర్చిన న్యూ హాంప్‌షైర్ కు చెందిన ఓ వ్యక్తి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.