రాజభవన్ ప్రదర్శన లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ -ఉద్రిక్తత
కార్యకర్తల భుజాలపైకి ఎక్కి బారికేడ్లు దూకిన రేవంత్ రెడ్డి
ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ
ర్యాలీ చేసి తీరతామన్న రేవంత్
ఇందిరాపార్క్ వద్ద హైడ్రామా
అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్‌భవన్’కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పలు చోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని నిలువరించే ప్రయత్నాలు చేశారు.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేసిన ఈ ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది.కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా తమ ఆందోళన వ్యూహం మార్చుకోవడంతో దిక్కు తోచని పోలీసులు వారిని నిలవరించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగి పలువురు పోలీసులు కిందపడిపోయారు. అనంతరం, గవర్నర్ అందుబాటులో లేరని, ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు రేవంత్ రెడ్డికి సూచించారు. తాము అంబేద్కర్ విగ్రహం వరకు తమ ర్యాలీ చేసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో కార్యకర్తల భుజాలపైకి ఎక్కిన రేవంత్ రెడ్డి బారికేడ్లు దూకారు. దీంతో ఆయనతో పాటు అక్కడ ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మా సహనాన్ని పరీక్షించకూడదు: రేవంత్ రెడ్డి
- అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి
- పెట్రోలు, డీజిల్ ధరలపై ఆందోళన కొనసాగిస్తాం
- అరెస్టులు, నిర్బంధాలు చేస్తే చూస్తూ ఊరుకోం
- లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారు
అరెస్టు చేసిన వారిని పోలీసులు వెంటనే విడిచిపెట్టాలని ఆయన అన్నారు. శాంతియుత నిరసనలను ఇలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తారని ఆయన హెచ్చరించారు. ఎంత మందిని అరెస్టు చేయించినప్పటికీ తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పన్నులను పెంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజల ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేందుకు తాము వెనకాడబోమని చెప్పారు.