
మంత్రి పొంగులేటిపై కొండాదంపతుల ఫిర్యాదుల పరంపర…
సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్‌లకు ఫిర్యాదు
మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ,కొండా మురళి ఖర్గే కు ఫిర్యాదులు
నా శాఖలో ఆయన జోక్యమేంటి?.. పొంగులేటిపై కొండా సురేఖ ఫైర్
మేడారం టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ మధ్య విభేదాలు
రూ.71 కోట్ల టెండర్‌ను తన అనుచరుడికి ఇప్పించేందుకు పొంగులేటి ప్రయత్నం అని ఆరోపణ
మేడారం పనులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ
అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న కొండా మురళి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రతిష్ఠాత్మక మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి మేడారం పనులను ఇప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా కొండా మురళి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంలో అధిష్ఠానం నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని కొండా మురళి తెలిపారు. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది మేడారం జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని కొండా మురళి భార్య, మంత్రి కొండా సురేఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సుమారు రూ.71 కోట్ల విలువైన మేడారం అభివృద్ధి పనుల టెండర్‌ను తన అనుచరుడికి కట్టబెట్టేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖ పరిధిలోని విషయాల్లో ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కూడా పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
రాబోయే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని, ఆలయ అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా మేడారం సందర్శించి, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలక సమయంలో ఇద్దరు మంత్రుల మధ్య టెండర్ల వివాదం తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది…