అంతర్జాతీయం

ట్రంప్ వైఖరిపై ఇంట బయట విమర్శలు …

Donald Trump tariffs spark EU emergency meeting
  • ఈయూ దేశాలపై టారిఫ్ లు విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన నేతలు
  • అమెరికా, ఈయూల సంబంధాలపై ప్రభావం పడుతుందని ఆందోళన
  • డెన్మార్క్ సైనిక విన్యాసాలకు మద్దతు పలికిన ఈయూ నేతలు
  • ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా ఈయూ దేశాల ఎమర్జెన్సీ మీటింగ్!

గ్రీన్ లాండ్ ను అమెరికాలో కలిపేసుకోవాలన్న తన అభీష్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఈయూ కూటమిలోని 8 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా 10 శాతం టారిఫ్ లు విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఈయూ చీఫ్ లు తప్పుబట్టారు. ట్రంప్ బెదిరింపు సుంకాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో యురోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లాన్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ఓ ప్రకటన జారీ చేశారు.

ట్రంప్ ప్రతిపాదిత సుంకాలు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈయూ– యూఎస్ సంబంధాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఇందులో వారు హెచ్చరించారు. పరస్పర సహకారం తప్పనిసరిగా మారిన పరిస్థితుల్లో ఈ ధోరణి ఇరువైపులా నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని, వాణిజ్య అడ్డంకులకు ఊతమిస్తాయని చెప్పారు.

‘యూరప్ ఐక్యంగా, సమన్వయంతో మరియు దాని సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉంటుంది’ అంటూ ఈయూ చీఫ్ లు ట్వీట్ చేశారు. మిత్రదేశాలతో కలిసి డెన్మార్క్ ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలను కూడా వారు సమర్థించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతను పెంచడమే ఈ విన్యాసం ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇది ఏ దేశానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. డెన్మార్క్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ చర్చల ప్రాముఖ్యతను ఈయూ గుర్తుచేసింది.

ఈ విషయంపై ఉర్సులా వాండెర్ లాన్ ఎక్స్ లో స్పందిస్తూ.. ప్రాదేశిక సమగ్రత మరియు సార్వభౌమాధికారం అంతర్జాతీయ చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలని చెప్పారు. ఇవి యూరప్‌ తో పాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అవసరమన్నారు. నాటో ద్వారా ఆర్కిటిక్‌లో శాంతి మరియు భద్రతపై మా ఉమ్మడి అట్లాంటిక్ ఆసక్తిని మేము నిరంతరం నొక్కిచెప్పామని వాండెర్ లాన్ పేర్కొన్నారు.

ట్రంప్ ప్రకటనతో రచ్చ.. చైనా, రష్యాకు పండగేనంటున్న ఈయూ

Trumps Tariff Announcement Angers EU Russia and China Rejoice

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో పశ్చిమ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి. గ్రీన్‌లాండ్‌ను తమకు పూర్తిగా అమ్మేయాలని డెన్మార్క్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, 8 ఐరోపా దేశాలపై భారీగా టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఐరోపా సమాఖ్య (ఈయూ), బ్రిటన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

శనివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్ నుంచి వచ్చే అన్ని వస్తువులపై ఫిబ్రవరి 1, 2026 నుంచి 10 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. జూన్ 1 నాటికి గ్రీన్‌లాండ్‌పై ఒప్పందం కుదరకపోతే ఈ సుంకాన్ని 25 శాతానికి పెంచుతామని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌లో ఐరోపా దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ‘ప్రమాదకరమైన ఆట’ ఆడుతున్నాయని, ప్రపంచ శాంతిని కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ నిర్ణయాన్ని ఐరోపా దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మిత్రదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని ఈయూ నాయకులు హెచ్చరించారు. ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ స్పందిస్తూ.. “ఈ పరిణామాలతో చైనా, రష్యాలకు పండగే” అని వ్యాఖ్యానించారు. మిత్రదేశాల మధ్య విభేదాలు వారికి లాభం చేకూరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, బ్రిటన్ అధినేతలు కూడా ఈ బెదిరింపులను తప్పుబట్టారు.

ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతను పెంచేందుకే తాము సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని, అవి ఎవరికీ ముప్పు కలిగించవని యూరప్ దేశాలు వాదిస్తున్నాయి. ఈ తాజా పరిణామాలపై చర్చించి, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఐరోపా సమాఖ్య రాయబారులు ఆదివారం అత్యవసరంగా సమావేశం కానున్నారు.

 ట్రంప్ తీరుకు నిరసనగా గడ్డకట్టించే చలిలో గ్రీన్ లాండ్ వాసుల నిరసన

Greenlanders Massive Protest Against Trumps Acquisition Plans

గ్రీన్ లాండ్ ను ఏదేమైనా సరే స్వాధీనం చేసుకుని తీరతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకించే దేశాలపై టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్.. అన్నట్టుగానే ఈయూలోని 8 దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాలపై గ్రీన్ లాండ్ లో నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం గ్రీన్ లాండ్ రాజధాని నగరం నూక్ లో వేలాదిమంది జనం ఆందోళన చేశారు. గడ్డకట్టించే చలిలో జాతీయ పతాకాలను చేతబట్టి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రధాని జెన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో ‘గ్రీన్ లాండ్ అమ్మకానికి లేదు’ అంటూ నినాదాలతో జనం హోరెత్తించారు. తమ సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని గ్రీన్ లాండ్ వాసులు స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా గళమెత్తిన ఈయూ దేశాలపై టారిఫ్ లు విధించడాన్ని తప్పుబట్టారు. నూక్ జనాభాలో దాదాపు నాలుగో వంతు జనం ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

నిరసనకారులు తమ పిల్లలను కూడా ఈ ఆందోళనకు వెంట తీసుకువచ్చారు. తమ దేశాన్ని కాపాడుకోవడం, ప్రపంచానికి తమ గొంతు వినిపించడం రేపటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో పిల్లలను కూడా నిరసనలకు తీసుకొచ్చామని వారు తెలిపారు. కాగా, గ్రీన్ లాండ్ లో ఇప్పటి వరకు జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదని స్థానిక పోలీసులు వెల్లడించారు.

ట్రంప్ టారిఫ్‌ల భారం మోస్తూనే.. యూఎస్‌లో సత్తా చాటిన దక్షిణ కొరియా కార్ల కంపెనీలు

Hyundai Kia Achieve Record US Sales Despite Trump Tariffs

అమెరికా ఆటోమొబైల్ మార్కెట్లో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థలు హ్యుందయ్, దాని అనుబంధ సంస్థ కియా సరికొత్త రికార్డు సృష్టించాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లను దూకుడుగా పెంచినప్పటికీ 2025లో ఈ రెండు కంపెనీలు కలిసి 11.3 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. గతేడాది అమెరికాలో హ్యుందయ్, కియా కలిపి మొత్తం 18.4 లక్షల వాహనాలను విక్రయించాయి.

మార్కెట్ రీసెర్చ్ సంస్థ వార్డ్స్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం హ్యుందయ్ 9,84,017 యూనిట్లతో 6.1 శాతం వాటాను, కియా 8,52,155 యూనిట్లతో 5.2 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లో జనరల్ మోటార్స్ (17.5%), టయోటా (15.5%), ఫోర్డ్ (13.1%) తర్వాత ఈ గ్రూప్ నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం యూఎస్ మార్కెట్ 2.4 శాతం వృద్ధి చెందగా, హ్యుందయ్, కియా అమ్మకాలు 7.5 శాతం పెరగడం విశేషం.

స్థానికంగా ఉత్పత్తిని పెంచడం, హైబ్రిడ్ వాహనాల అమ్మకాలపై దృష్టి పెట్టడం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది హ్యుందయ్, కియా హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు ఏకంగా 48.8 శాతం పెరిగి 3,31,023 యూనిట్లకు చేరాయి. యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం జార్జియాలో హ్యుందయ్ మూడో ప్లాంట్‌ను పూర్తి చేయడంతో స్థానిక ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. టారిఫ్ భారాన్ని వినియోగదారులపై మోపకుండా కంపెనీయే భరించడం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడింది. ఈ వ్యూహం కారణంగా దక్షిణ కొరియా నుంచి అమెరికాకు వాహనాల ఎగుమతులు 4.2 శాతం తగ్గాయి.

Related posts

 వధువు వయసు 25 ఏళ్లలోపు ఉంటే నగదు బహుమతి.. చైనా ప్రభుత్వం బంపరాఫర్

Ram Narayana

హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్!

Ram Narayana

భారతీయులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసిన అమెరికా!

Ram Narayana