జాతీయ రాజకీయ వార్తలు

విజయ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారంటే..?

  • జోతిష్యుడి సూచనలతో V అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను పరిశీలిస్తున్న విజయ్
  • అలాంటి నియోజకవర్గాలపై ద్వితీయ శ్రేణి నేతలతో చర్చలు 
  • విజయ్ పరిశీలనలో ఐదు నియోజకవర్గాలు

రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘V’ కావడంతో అదే అక్షరంతో ప్రారంభమయ్యే నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.  

సెంటిమెంట్ దృష్ట్యా ‘వి’ అక్షరంతో ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని ఓ జ్యోతిష్యుడు సూచించాడన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అలాంటి నియోజకవర్గాలపై ద్వితీయ శ్రేణి నేతలతో విజయ్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నైలోని విరుగంబాక్కం, వేళచ్చేరి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలపై పరిశీలన జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక బలం కూడా రాజకీయంగా కలిసొస్తుందని అంటున్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ పరిశీలనలో చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, విళుప్పురం జిల్లా విక్రవాండి, నాగపట్టినం జిల్లా వేదారణ్యం, దిండుగల్ జిల్లా వేడసందూర్ నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. విరుగంబాక్కంలో విజయ్ తల్లిదండ్రులు నివసిస్తుండగా, పనైయూర్ లోని విజయ్ నివాసం, పార్టీ కార్యాలయానికి వేళచ్చేరి సమీపంలో ఉండటం గమనార్హం. ఇక టీవీకే తొలి రాజకీయ మహానాడు జరిగిన ప్రాంతం విక్రవాండి కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచే విజయ్ తన రాజకీయ లక్ష్యాలు, విధానాలను ప్రకటించారు. 

విజయ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న డీఎంకే, ఆయన పోటీ చేసే నియోజకవర్గంలోనే బలమైన అభ్యర్థిని నిలబెట్టి భారీ మెజారిటీతో ఓడించాలని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలని విజయ్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

టీవీకే ఇప్పటికే విజయ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందున, ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తుది నిర్ణయాన్ని ఎన్నికల సమయంలోనే ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Related posts

కొర‌డాతో కొట్టుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామ‌లై.. !

Ram Narayana

సీడబ్ల్యూసీ భేటీ… పహల్గామ్ ఉగ్రదాడి, కులగణనపై ఖర్గే కీలక వ్యాఖ్యలు!

Ram Narayana

వచ్చే నెలతో ఆప్ పీడ విరగడ అవుతుంది: అమిత్ షా

Ram Narayana